• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాల జాప్యంపై అభ్యర్థుల ఆందోళన

విద్యార్థులతో ఎన్‌టీఏ చెలగాటం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడించడంలో జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నా ఎన్‌టీఏ మాత్రం ర్యాంకులను వెల్లడించే తేదీని స్పష్టం చేయడం లేదు. అధికారికంగా ప్రకటన కూడా జారీ చేయకపోవడంతో విద్యార్థులు ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్‌టీఏ అంటే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కాదని...నాట్‌ టుడే ఏజెన్సీ అని వ్యాఖ్యానిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడే కాదు...గత మూడు సంవత్సరాల నుంచి జేఈఈ మెయిన్‌ ఫలితాలను అర్ధరాత్రి, తెల్లవారుజామున విడుదల చేస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతోందన్న విమర్శలు విద్యావేత్తల నుంచి వస్తున్నాయి. 

పాపం.. ఐఐటీ ఖరగ్‌పూర్‌

ఎన్‌టీఏ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని నమ్మిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ తొలుత సెప్టెంబ‌రు 11 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని కాలపట్టికను జారీ చేసింది. అంటే మెయిన్‌ ర్యాంకులను సెప్టెంబ‌రు 10వ తేదీలోపు వెల్లడించాల్సి ఉంది. అది చేయకపోవడంతో సెప్టెంబ‌రు 13వ తేదీ మధ్యాహ్నం నుంచి అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. అయినా ఎన్‌టీఏ సోమవారం కూడా జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెల్లడించలేదు. ఫలితంగా దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తాజా సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని సోమవారం సాయంత్రం ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది. దీని ప్రకారం మరోసారి దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడినట్లే. కొన్ని టీవీ ఛానళ్లతో ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌జోషి మాట్లాడుతూ.. ఫలితాలను ఈ వారంలో విడుదల చేస్తామన్నారు. ఫలితాల జాప్యానికి సీబీఐ విచారణ కారణం కాదని, సిబ్బంది అనారోగ్యం బారిన పడటమే అని చెప్పారు.

 

మరిన్ని క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి

 

CV First Site‌: సి.వి. @ ఫస్ట్‌ సైట్‌! 

ప్రాధాన్యం పెరుగుతున్న.. కామర్స్‌ కోర్సులు

Posted Date : 14-09-2021