• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ కోర్సుల్లో అమ్మాయిల హవా

వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో అమ్మాయిలు 67%, అబ్బాయిలు 33% మంది అర్హత

తొలి పది ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు చెరి సగం

అగ్రస్థానాల్లో ముగ్గురూ అబ్బాయిలే

ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

 

 

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం: ఈఏపీసెట్‌ వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశపరీక్ష ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఇంజినీరింగ్‌తో పోలిస్తే దరఖాస్తుల నుంచి ఫలితాల వరకూ అమ్మాయిలే ఎక్కువ. పరీక్షకు అబ్బాయిలు 25,715 మంది, అమ్మాయిలు 52,351 మంది హాజరుకాగా.. అబ్బాయిలు 23,778 మంది, అమ్మాయిలు 48,710 మంది అర్హత సాధించారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 78,066 మంది పరీక్షలకు హాజరు కాగా.. 72,488 మంది (92.85%) అర్హత పొందారు. వ్యవసాయ, ఫార్మసీ ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందనం విష్ణు వివేక్‌ ప్రథమ, అనంతపురానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ, తెలంగాణలోని హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మొదటి పది ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థులు చెరి సగం దక్కించుకున్నారు. అర్హత సాధించిన వారికి బీఎస్సీ వ్యవసాయం, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య, బి.ఫార్మసీ, ఫార్మాడీతో పాటు బీటెక్‌ బయోటెక్నాలజీ, ఫుడ్‌సైన్సు టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంకు కార్డులను సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

 

పెరిగిన అభ్యర్థులు..

గతేడాది కంటే ఈసారి అర్హత సాధించిన వారు 2,872 మంది పెరిగారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయడంతో ఈఏపీసెట్‌లో ఈ ఏడాది ఇంటర్‌ మార్కుల వెయిటేజీని తొలగించారు. రాతపరీక్ష ఆధారంగా మార్కులు, ర్యాంకులు కేటాయించారు. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలతో 14 ప్రశ్నలకు సమాధానాలను మార్చగా, రెండు ప్రశ్నలకు రెండు సమాధానాల్లో ఏది రాసినా మార్కులు కేటాయించారు. 

 

ఒకేసారి కన్వీనర్, యాజమాన్య కోటా..

ఈసారి ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఒకేసారి ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. యాజమాన్యకోటా సీట్లనూ కన్వీనరే భర్తీ చేయనున్నారు. కన్వీనర్‌ కోటాలో సీటు పొందినవారిలో అర్హులకు బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది. యాజమాన్య కోటా కేటగిరి-బీ సీట్లలో చేరేవారికి ఈ చెల్లింపు వర్తించదు. యాజమాన్య కోటాలో సగం ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా ఉంటుంది. వీటిని యాజమాన్యాలే భర్తీ చేసుకోనున్నాయి. వీటిలో మిగిలిన సీట్లనూ కన్వీనర్‌ ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు. ప్రైవేటు విశ్వ విద్యాలయాల్లోనూ 35% సీట్లు కన్వీనర్‌ కోటాలోకి రానున్నాయి. సెప్టెంబరు 18న ప్రవేశాల ప్రక్రియకు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కన్వీనర్‌గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వ్యవహరిస్తారు. 

 

న్యూరాలజిస్టు కావాలనుకుంటున్నా

న్యూరాలజిస్టుగా స్థిరపడి పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యమని ఏపీ ఈఏపీసెట్‌ ప్రథమ ర్యాంకరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చందం విష్ణు వివేక్‌ చెప్పారు. పదో తరగతి చదివేటప్పుడు మొదడులోని నరం పట్టుతప్పి అస్వస్థతకు గురి కాగా, చికిత్స కోసం న్యూరాలజిస్టు వద్దకు వెళ్లినప్పుడు వైద్యవృత్తి ప్రాధాన్యం తెలిసిందన్నారు. వైద్యవృత్తి చేపట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. నీట్‌లోనూ మంచిర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. కోరుకొండకు చెందిన ఆయన తండ్రి వెంకటేశ్వరరావు స్థానికంగా వెల్డింగ్‌ పనిచేస్తుంటారు. అమ్మ లక్ష్మి గృహిణి. సోదరుడు భాగ్వేష్‌ భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో వైద్యవిద్య రెండో ఏడాది చదువుతున్నారు. వివేక్‌కు ఇటీవల తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు వచ్చింది.

 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల అధ్యయనం..

తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్యవృత్తి చేపట్టాలన్నదే తన లక్ష్యమని రెండో ర్యాంకర్‌ శ్రీనివాస కార్తికేయ తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని, సమాధానాలు తెలియని ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో శిక్షణలో తెలుసుకోవడంతో పరీక్ష రాయడం సులువైందని చెప్పారు. కార్తికేయ తల్లిదండ్రులు సుధీంద్ర, పద్మజ ఇద్దరూ వైద్యులే. కార్తికేయ పదో తరగతి వరకు స్థానిక చైతన్య పాఠశాలలో, ఇంటర్‌ విజయవాడలో చదివారు. 

 

గ్రామీణ పేదలకు వైద్యసేవలు అందిస్తా

‘డాక్టర్‌ కావాలనే ధ్యేయంతో పదోతరగతి నుంచే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సూచన మేరకు ప్రణాళికతో చదువు కొనసాగించా. అనుకున్న లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకం ఉంది. మారుమూల గ్రామాల్లో పేదలకు వైద్యసేవలు అందిస్తా’ అని ఏపీఈఏపీసెట్‌ మూడో ర్యాంకర్‌ విశ్వాస్‌రావు తెలిపారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన విశ్వాస్‌రావు తండ్రి కరుణాకర్‌రావు ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ ఆఫీసరు, తల్లి సుజాత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తెలంగాణ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 49వ ర్యాంకు వచ్చింది.


 

Posted Date : 14-09-2021