• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలపై సందిగ్ధత

* తరగతులకు దూరమవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలు, తరగతుల నిర్వహణలో జాప్యంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్‌ విద్యామండలి ఇటీవల ఆన్‌లైన్‌ ప్రవేశాలను చేపట్టగా.. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు ఆన్‌లైన్‌ ప్రవేశాలను రద్దు చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నదానిపై ఇంటర్‌ విద్యామండలి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒక పక్క ప్రైవేటు కళాశాలలు ప్రవేశాలను పూర్తి చేసి, విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్‌తోపాటు పాఠాలు బోధిస్తుండగా.. మరోపక్క ప్రభుత్వ కళాశాలల్లో చేరాలనుకున్న వారు మాత్రం ఇళ్లల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. అక్టోబరు 1నుంచి ఉన్నత విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ప్రవేశాలపై స్పష్టత రాలేదు. విద్యా సంవత్సరం కరిగిపోతున్నా తరగతులు ఎప్పుడనే దానిపై సందిగ్ధత వీడడం లేదు. 

 

పేద విద్యార్థులకు నష్టం..

ప్రభుత్వ యాజమాన్యంలోని ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, గిరిజన, బీసీ గురుకులాలు ఇప్పటికే ఇంటర్‌ ప్రవేశాలు పూర్తి చేశాయి. ఇంటర్‌లో ఏటా 5లక్షలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. వీరిలో 1.75లక్షల మంది వరకు ప్రభుత్వ కళాశాలల్లో చేరతారు.  తోటి విద్యార్థులు కళాశాలలకు వెళ్తుండగా.. వీరు ఇంటి వద్దనే ఉంటుండడంతో వారి చదువులపై తల్లిదండ్రులు మానసిక వ్యధకు గురవుతున్నారు.
 

Posted Date : 14-09-2021