• facebook
  • whatsapp
  • telegram

Junior Linemen: జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను నెలలోగా భర్తీ చేయండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: జూనియర్‌ లైన్‌మెన్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియను నెలలోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కోను హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఆ పోస్టుల కోసం 2017 డిసెంబరు, 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ల కింద వాటి భర్తీని చేపట్టాలంది. ట్రాన్స్‌కోలో సబ్‌ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నందున ఈ నియామకాలు ఆ తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ల కింద పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇన్‌సర్వీసులో ఉన్న ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు 20 శాతం మార్కులు కేటాయించాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాలను కొట్టివేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌లు, సబ్‌ఇంజినీర్ల పోస్టుల భర్తీ కోసం ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌లు ఇచ్చిన నోటిఫికేషన్‌లలో ఇన్‌సర్వీసులో ఉన్నవారితో పాటు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు 20% మార్కులు కేటాయించాలంటూ ఏడు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు వెలువరిస్తూ ఈ వివాదాలకు సంబంధించి గతంలో ఇదే హైకోర్టులోని ఫుల్‌బెంచ్‌ తీర్పు వెలువరించిందన్నారు. నోటిఫికేషన్‌లో అర్హతలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి యాజమాన్యానికి అర్హత ఉంటుందని గతంలో పేర్కొన్నారంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌లలో జోక్యం చేసుకోలేమంటూ వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కోను ఆదేశించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ అమెజాన్‌లో 8000 ఉద్యోగాలు

‣ 8వేల మంది ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు

‣ ఎస్‌ఈసీఎల్‌లో 450 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఐపీఈ ఆహ్వానం

Posted Date : 21-09-2021