• facebook
  • whatsapp
  • telegram

EAMCET: ఎంసెట్‌ సీటా.. ఐఐటీల వైపా?

విద్యార్థుల్లో అయోమయం

ఫీజు కడితే తిరిగి రాదన్న ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలో పేరొందిన కళాశాలల్లో సీట్లు దక్కించుకున్నారు. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నారు. అందులో మంచి ర్యాంకు వస్తే ఐఐటీల్లో చేరాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వీరు కట్టిన ఫీజును వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఐఐటీలకు వెళ్లాలా? లేక ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా పొందిన సీటుతో సంతృప్తి పడాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు.  

రాష్ట్రంలో ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి కావడంతో సీట్ల కేటాయింపు జరిగింది. సీటు వచ్చిన కళాశాలలో సెప్టెంబరు 23లోపు ఫీజు చెల్లించాలి. అప్పుడే సీటు నిర్ధారించుకున్నట్లు అవుతుంది. ఆ తర్వాత వద్దు అనుకుంటే 28వ తేదీలోగా రద్దు చేసుకునే అవకాశం ఉంది. అలా రద్దు చేసుకుంటే కళాశాలకు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేందుకు వీలుంది. ఎంసెట్‌లో 2,000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నారు. అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంది. 15న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశించేందుకు వీలుంటుంది. ఇదే సమయంలో ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చి ఫీజు చెల్లించి ఉంటే.. ఫీజు వెనక్కి ఇవ్వరు. ఉదాహరణకు గండిపేట సమీపంలోని ఓ కళాశాలలో ఫీజు రూ.1.30 లక్షలు ఉంది. అంత ఫీజు చెల్లించి.. తర్వాత అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చి ఐఐటీకి వెళ్లాలనుకుంటే, ఆ విద్యార్థి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ఫీజు చెల్లించాలో.. ఆగాలో తెలియక తల్లిదండ్రులూ ఆవేదన చెందుతున్నారు. 

 

సీట్లు మిగులుతుండడంతో నిబంధనలు కఠినతరం!

‘‘ఏటా ఎంసెట్‌ ర్యాంకర్లు ఇక్కడ ప్రవేశాలు పొంది.. ఐఐటీల్లో సీట్లు రాగానే వెళ్లిపోతున్నారు. దీంతో ఇక్కడి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఆ తర్వాత ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయా కళాశాలల్లో సీట్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేశాం’’ అని అధికారులు చెబుతున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌లు

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

‣ కోర్సుల నాణ్యత  కొలువుల ధీమా

‣ చాపకింద నీరులా నల్లధనం

Posted Date : 22-09-2021