• facebook
  • whatsapp
  • telegram

AU: ఏయూలో ‘అమెరికన్‌ కార్నర్‌’ ప్రారంభం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో అమెరికన్‌ కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ను ఆయన అమరావతి నుంచి ఆన్‌లైన్లో ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో మూడో ‘అమెరికన్‌ కార్నర్‌’ విశాఖలో ఏర్పాటు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి, ఆ దేశం వెళ్లాలని అనుకునేవారికి అమెరికన్‌ కార్నర్‌ అందించే సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అమెరికన్‌ కార్నర్‌ తరహాలోనే అమెరికన్‌ కాన్సులేట్‌ కూడా విశాఖలో ఏర్పాటు కావాలని కోరుకుంటున్నానని వివరించారు. విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన యు.ఎస్‌.కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కడప నుంచి యు.ఎస్‌.ఎ.ఐ.డి.భారత్, భూటాన్‌ దేశాలకు మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన తెలుగు మహిళ వీణారెడ్డికి ఇదే కార్యక్రమంలో సీఎం అభినందనలు తెలిపారు. అనంతరం కంప్యూటర్‌ మీట నొక్కి అమెరికన్‌ కార్నర్‌ను ఆయన ప్రారంభించారు. 
ఇదో అద్భుత ఘట్టం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు ఒక అద్భుత ఘట్టమని యు.ఎస్‌.కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మాన్‌ పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో యువతకు, ప్రత్యేకించి మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించడంలో అమెరికన్‌ కార్నర్‌ కీలక భూమిక పోషిస్తుందని వివరించారు. యు.ఎస్‌.ఎ.ఐ.డి. మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు తన స్వస్థలమని, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను, అభివృద్ధి లక్ష్యాలను చర్చించడానికి ఒక వేదికగా అమెరికన్‌ కార్నర్‌ ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

 

Posted Date : 24-09-2021