• facebook
  • whatsapp
  • telegram

AP News: ప్రభుత్వాసుపత్రుల్లో 14,391 పోస్టుల భర్తీ

* ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్‌ 

* నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ

 

 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ) దాదాపు 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నియామక ప్రక్రియ ప్రారంభించి నవంబరు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సెప్టెంబరు 24న వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. తీరా అక్కడ వైద్య సిబ్బంది లేక రోగులకు సేవలు అందట్లేదు. ఏళ్ల తరబడి ఇలాంటి సమస్యలే ఉంటున్నాయి. ఇకపై వాటికి అడ్డుకట్ట పడాలి. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందాలి. ఆ లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలి’’ అని ఆదేశించారు. కుటుంబ వైద్యుడు (ఫ్యామిలీ డాక్టర్‌) కాన్సెప్ట్‌ను మొదలుపెట్టాలని, అన్ని ప్రభుత్వాసుపత్రులను సరిపడా సిబ్బందితో సమర్థంగా నడపాలని పేర్కొన్నారు. ఒక వైద్యుడు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరొకరు విధులు నిర్వహించేలా తగినంత మందిని వైద్యుల్ని నియమించాలని ఆదేశించారు.

 

ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే!

ఆ మూడు జిల్లాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌

* ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. అందుకోసం ప్రత్యేకాధికారుల్ని నియమించండి. 

* రాత్రి కర్ఫ్యూ యథావిధిగా అమలు చేయాలి. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించాలి. కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి

* వ్యాక్సినేషనే కొవిడ్‌ సమస్యకు పరిష్కారం. దీన్ని వేగవంతం చేయాలి. కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి.

 

అధికారులు ఏమన్నారంటే..

* ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక జిల్లాలో 5 శాతం కంటే ఎక్కువ, రెండు జిల్లాల్లో 3-5 శాతం లోపు, పది జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఉంది.

* రాష్ట్ర వ్యాప్తంగా 10,921 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదు. 

* కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తే అందుకు సన్నద్ధతగా 27,311 డీటైప్‌ సిలెండర్లు, 20,964 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 2,493 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు రావాల్సి ఉంది. 128 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యాయి. 143 చోట్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అక్టోబరు పదో తేదీ నాటికి ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. 

* ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 కొవిడ్‌ క్రియాశీలక కేసులున్నాయి. 2,787 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 

సివిల్స్‌-2020 ఫలితాలు విడుదల 

 

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

Posted Date : 24-09-2021