• facebook
  • whatsapp
  • telegram

Jobs: కొత్త ఉద్యోగాలు 3.08 కోట్లు

ఏప్రిల్‌-జూన్‌ మధ్య 9 రంగాల్లో సృష్టి

కార్మిక శాఖ సర్వే

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌-జూన్‌లో నిర్మాణ, తయారీ, ఐటీ/బీపీఓ సహా 9 ఎంపిక చేసిన రంగాల్లో 3.08 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని కార్మిక శాఖ సర్వే వెల్లడించింది. 2013-14 ఆర్థిక గణాంకాల ప్రకారం నమోదైన 2.37 కోట్ల ఉద్యోగాలతో పోలిస్తే ఇది 29 శాతం అధికమని తెలిపింది. కార్మిక బ్యూరో రూపొందించిన ఆలిండియా ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే (ఏక్యూఈఈఎస్‌)లో భాగంగా త్రైమాసిక ఉపాధి సర్వే (ఏఈఎస్‌) ఏప్రిల్‌-జూన్‌ నివేదికను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్‌ యాదవ్‌ విడుదల చేశారు. 9 ఎంపిక చేసిన రంగాల్లో సంఘటిత, అసంఘటిత విభాగాల్లో ఉద్యోగాల సృష్టికి సంబంధించిన వివరాలను ఏక్యూఈఈఎస్‌ నుంచి కార్మిక బ్యూరో తీసుకుంటుంది. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవలు వంటి 9 రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పన జరుగుతోంది. మొత్తం ఉద్యోగాల్లో తయారీ రంగ వాటా 41 శాతం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో విద్య (22 శాతం), ఆరోగ్యం (8 శాతం), వాణిజ్యం, ఐటీ/బీపీఓ (7 శాతం) రంగాలు నిలిచినట్లు యాదవ్‌ తెలిపారు. 

నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా..

కరోనా సంక్షోభ ప్రభావం 27 శాతం సంస్థలపై పడింది. అయితే లాక్‌డౌన్‌ విధించిన 2020 మార్చి 25- జూన్‌ 30 మధ్య 81 శాతం మంది ఉద్యోగులకు పూర్తి వేతనాలు లభించాయి. 

ఐటీ/బీపీఓ రంగం అత్యధికంగా 152 శాతం వృద్ధి నమోదుచేసింది. ఆరోగ్యం 77 శాతం, విద్య 39 శాతం, తయారీ 22 శాతం, రవాణా 68 శాతం, నిర్మాణం 42 శాతం, ఆర్థిక సేవలు 48 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. ఇదే సమయంలో వాణిజ్యంలో 25 శాతం, ఆతిథ్యం 13 శాతం ఉద్యోగాలు తగ్గాయి.

90 శాతం సంస్థలు 100 కంటే తక్కువ మంది ఉద్యోగులతో పనిచేశాయి. 35 శాతం ఐటీ/బీపీఓ సంస్థలు కనీసం 100 మందితో పనిచేయగా, 13.8 శాతం సంస్థలు 500 లేదా అంతకంటే ఎక్కువ మందితో కార్యకలాపాలు నిర్వహించాయి. ఆరోగ్య రంగంలో 18 శాతం సంస్థలు 100 లేదా ఎక్కువ మందితో పనిచేశాయి. మొత్తం మహిళా ఉద్యోగుల వాటా 29 శాతంగా ఉంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీలో 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

‣ 6 నెలల్లో 2,500 నియామకాలు: హెచ్‌డీఎఫ్‌సీ

‣ మూడేళ్లలో 10వేల నియామకాలు: మౌరిటెక్‌

‣ 8వేల మంది ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు

Posted Date : 28-09-2021