• facebook
  • whatsapp
  • telegram

Aided Colleges: ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల విలీనానికి మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లకు గ్రాంటు నిలిపివేత, సిబ్బంది విలీనానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆస్తులతో సహా పూర్తిగా అప్పగించేందుకు ముందుకొచ్చే యాజమాన్యాల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు సూచించింది. అందులోని మార్గదర్శకాల ప్రకారం.. ఎలాంటి పరిహారం లేకుండా ఆస్తులతో సహా అప్పగిస్తే, ఆ విద్యాసంస్థలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చనుంది. ఆయా విద్యాసంస్థలకు అదనంగా ఉండే ఆస్తులను ప్రజా అవసరాలకు వాడుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆస్తులు అప్పగించకుండా సిబ్బందిని మాత్రమే వెనక్కి ఇచ్చే వాటి నుంచీ సమ్మతి లేఖలు తీసుకోనుంది. అలాంటిచోట సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకొని, గ్రాంటును శాశ్వతంగా నిలిపివేయనుంది. ఈ సిబ్బందికి ప్రత్యేకంగా సర్వీసు నిబంధనలు రూపొందించి, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో సర్దుబాటు చేయనుంది. ప్రైవేటుగా నిర్వహించుకునే యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించడం, అమ్మడం చేయరాదు. గ్రాంటును నిలిపివేసే కళాశాలల్లో చదివే విద్యార్థులకు బోధన రుసుములను చెల్లించనున్నట్లు పేర్కొంది.

డిగ్రీ సిబ్బంది కౌన్సెలింగ్‌ ప్రారంభం 

ఎయిడెడ్‌ డిగ్రీ బోధన, బోధనేతర సిబ్బంది కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సవరిస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సెప్టెంబరు 27-30, పరిశీలన అక్టోబరు 1-4, వెబ్‌ ఐచ్ఛికాల ఎంపిక 5న, పోస్టింగ్‌ ఆదేశాలు 6న ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను పురపాలక బడుల్లో నియమించాలి: ఎంటీఎఫ్‌

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను పని సర్దుబాటు కింద పురపాలక పాఠశాలల్లో నియమించాలని పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య(ఎంటీఎఫ్‌) అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. ‘ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేయడం వల్ల వాటిల్లోని విద్యార్థులు పురపాలక బడుల్లో ప్రవేశాల కోసం వస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్‌ స్కూళ్లలో 15%-20% ప్రవేశాలు పెరిగాయి. మరోపక్క 1,425 స్కూల్‌ అసిసెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేవు. ఈ తరుణంలో ఎయిడెడ్‌ బోధన సిబ్బందిని మున్సిపల్‌ స్కూళల్లో నియమించాల’ని కోరారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఉపాధినిచ్చేలా విభిన్న బ్రాంచీల సమ్మేళనం 

సృజనకు చిరునామా... ఫైన్‌ ఆర్ట్స్‌

 

Posted Date : 28-09-2021