• facebook
  • whatsapp
  • telegram

EFLU: ఇఫ్లూలో టీచింగ్‌ పోస్టుల నియామకాలకు హైకోర్టు అనుమతి 

 

హైదరాబాద్‌: ఇఫ్లూ(ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ)లో టీచింగ్‌ పోస్టుల (బోధనా సిబ్బంది) నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఇఫ్లూకి హైకోర్టు అనుమతిచ్చింది. గతేడాది 58 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఇఫ్లూ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓబీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని బీసీ కమిషన్‌లో దాసోజు శ్రవణ్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఇఫ్లూ నియామక ప్రక్రియపై గతంలో జాతీయ బీసీ కమిషన్‌ స్టే ఇచ్చింది. జాతీయ బీసీ కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఇఫ్లూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనివర్సిటీలో నియామకాలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. కేసు పూర్వాపరాల జోలికి ఇక్కడ వెళ్లడంలేదని తెలిపింది. ‘‘ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. రిజర్వేషన్ల వివాదంపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చు’’ అని ధర్మాసనం తెలిపింది. నియామకాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చని తెలిపింది.

Posted Date : 28-09-2021