• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు కొనసాగించుకోవచ్చు  

* తుది తీర్పునకు లోబడి పిటిషనర్ల ప్రవేశాలు: హైకోర్టు

ఈనాడు, అమరావతి: డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ కొనసాగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి పిటిషనర్ల ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో లోతైన విచారణ అవసరం అని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. విచారణను అక్టోబర్‌ 25కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు సెప్టెంబరు 29న ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరికి మార్కులు కేటాయించిన నేపథ్యంలో డిగ్రీలో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ విద్యార్థిని కీర్తన, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌  కౌంటర్‌ వేయడానికి సమయం కోరగా... అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
 

Posted Date : 29-09-2021