• facebook
  • whatsapp
  • telegram

Degree Online Admissions: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై గందరగోళం

* 15 రోజులుగా రిజిస్ట్రేషన్‌ దశలోనే ప్రవేశాలు

* వెబ్‌ ఐచ్ఛికాలపై స్పష్టత కరవు

* విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు విద్యార్థులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. కళాశాలలు, కోర్సుల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలు ఇచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కళాశాలలు, సీట్ల జాబితా, యాజమాన్య కోటాపై స్పష్టత రాకుండానే ఉన్నత విద్యామండలి ప్రవేశాలకు సెప్టెంబరు 16న ప్రకటన విడుదల చేసింది. మొదట సెప్టెంబరు 22 వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. కళాశాలల జాబితాలు రాకపోవడంతో దీన్ని 25 వరకు పొడిగించారు. ఇదిలా ఉండగానే డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా అమలుకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రవేశాల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల విలీనం పూర్తికాక, వాటి విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. దీంతో వెబ్‌ ఐచ్ఛికాలు నిలిచాయి. సవరించిన షెడ్యూలు ప్రకటించే వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చంటూ వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యామండలి సమాచారం ఉంచింది.

 

మరో వారం రోజులు..

డిగ్రీ కళాశాలల్లో 30% యాజమాన్య కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ కోటా కింద కళాశాల యాజమాన్యాలు కన్వీనర్‌ కోటా ఫీజుపై మూడింతల వరకు వసూలు చేసుకోవచ్చు. ఈ ఫీజులో ఏ కళాశాల ఎంత వసూలు చేస్తుందో ఉన్నత విద్యామండలికి వివరాలు సమర్పించాలి. ప్రైవేటులో దాదాపు 1,120 కళాశాలలు ఉన్నాయి. వీరందరూ యాజమాన్య కోటా ఫీజులపై సమ్మతి లేఖలు సమర్పించాలి. ఆ తర్వాత సీట్లను కన్వీనర్‌ కోటాలో 70%, యాజమాన్య కోటాలో 30%గా వర్గీకరించాలి. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం లేదు. యాజమాన్య కోటా సీట్లనూ కన్వీనర్‌ ద్వారానే భర్తీ చేస్తారు. 

 

ఆ కళాశాలలు సొంతంగానే..

మైనారిటీ ఎయిడెడ్‌ కళాశాలలు ఆన్‌లైన్‌ ప్రవేశాలకు దూరంగా ఉన్నాయి. ఈ కళాశాలలు సొంతంగానే సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. వీటిల్లో ప్రవేశాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఆంధ్ర లయోలా, మారిస్‌ స్టెల్లా, సెయింట్‌ జోసెఫ్, సెయింట్‌ థెరిస్సా నేరుగా ప్రవేశాలు చేసుకున్నాయి. ఇవికాకుండా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మరో నాలుగు కళాశాలల విలీనం విషయంలోనూ స్పష్టత రాలేదు. తెనాలిలోని జేఎంజే కళాశాల గ్రాంటును వదులుకునేందుకు అంగీకరించలేదు. ఇలాంటివి మరో మూడు కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలు ఎయిడెడ్‌ సెక్షన్లలో నిర్వహిస్తారా? లేదా? అనేదానిపై కళాశాల విద్యాశాఖ ఉన్నత విద్యామండలికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
 

Posted Date : 01-10-2021