• facebook
  • whatsapp
  • telegram

Border villages: సరిహద్దు గ్రామాల్లో ఒడియా చదువులు సాగనివ్వండి

* ఏపీ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో ఒడియా భాషను ప్రోత్సహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఇందుకోసం ఏపీలోని సరిహద్దు పాఠశాలల్లో ఒడియా టీచర్ల నియామకం చేపట్టాలంటూ శుక్రవారం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో గ్రామాల్లో ఒడియా భాషలో చదివేవారి సమస్యల పరిష్కారానికి మీ జోక్యం కోరుతున్నాను. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి సంస్కృతిని పంచుకుంటాయి. ఇరురాష్ట్రాల మధ్య సరిహద్దు రేఖను గీయడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు పాఠశాలలు కొన్ని అటూ, ఇటూ వచ్చాయి. దానివల్ల ఒడియా, తెలుగు మాట్లాడే పిల్లలు ఆయా పాఠశాలల్లో మైనార్టీలుగా మారిపోయారు. ఇప్పుడు వారి మాతృ భాషకు మద్దతివ్వాలి. అందువల్ల ఒడియాలో ఉండి తెలుగు... ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఒడియా భాషలు నేర్చుకోవాలనుకునే పిల్లల అవసరాలను తీర్చడానికి రెండు రాష్ట్రాలు ఇదివరకే ఒక ఒప్పందానికి వచ్చాయి. కానీ ప్రస్తుతం విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న ఒడిశా పిల్లలు తమ మాతృభాష నేర్చుకోలేకపోతున్నారు. ఒడిశా ప్రభుత్వం మాత్రం అక్కడ తెలుగు పిల్లలకు అవసరమైన టీచర్లను నియమిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా టీచర్లను నియమించాలి. ఒడియా మాధ్యమం పదోతరగతి పిల్లలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఇది ఒడియా మైనార్టీ పిల్లల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్‌లో భాషా వైవిధ్యాన్ని కాపాడే ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మైనార్టీల ప్రయోజనాలకు భద్రత కల్పించడం, దేశంలో సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని సంరక్షించడం ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత. ఇలాంటి విషయాల్లో నా వంతు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని సీఎం జగన్‌కు రాసిన లేఖలో ధర్మేంద్రప్రధాన్‌ పేర్కొన్నారు. 
 

Posted Date : 01-10-2021