• facebook
  • whatsapp
  • telegram

Courses: ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 30% యాజమాన్య కోటా

కన్వీనర్‌ కోటాపై మూడింతల వరకు ఫీజు వసూలుకు అవకాశం
ఈనాడు, అమరావతి: ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటా అమలుకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీలో పూర్తిగా కన్వీనర్‌ కోటా ఉండగా.. ఈ ఏడాది నుంచి 30% యాజమాన్య కోటా(కేటగిరీ-బీ)ని తీసుకొచ్చారు. ఎయిడెడ్‌ కళాశాలల్లోని అన్‌ ఎయిడెడ్‌ సెక్షన్లు, ప్రైవేటు స్వయంప్రతిపత్తి కళాశాలల్లోని కోర్సులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. కన్వీనర్‌ కోటా(కేటగిరీ-ఏ)కు ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులపై మూడింతల వరకు కేటగిరీ-బీకి వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. యాజమాన్య కోటా సీట్లనూ ఆన్‌లైన్‌లో మెరిట్‌ ఆధారంగా కన్వీనరే భర్తీ చేస్తారు. కన్వీనర్‌ భర్తీ చేసిన తర్వాత మిగిలే సీట్లను కళాశాలల యాజమాన్యాలు స్పాట్‌లో భర్తీ చేసుకోవచ్చు. ఈ కోటాలో చేరిన వారికి బోధన రుసుములు చెల్లించరు. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో 80% గ్రామీణంలో ఉండగా.. వీటిల్లో 70% లోపు సీట్లే భర్తీ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో 30% యాజమాన్య కోటాతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో అన్ని ప్రైవేటు కళాశాలలూ తప్పనిసరిగా న్యాక్‌ గుర్తింపు పొందాలని, ప్రస్తుతం మొత్తం కళాశాలల్లో 1% మాత్రమే అక్రెడిటేషన్‌ ఉందని పేర్కొన్నారు.
డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌
డిగ్రీ ఆన్‌లైన్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 10 నుంచి 15 వరకూ వెబ్‌ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో 21న చేరాలి. కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు పూర్తయ్యాక కేటగిరి-బీ సీట్ల భర్తీ చేపట్టనున్నారు.

Posted Date : 08-10-2021