• facebook
  • whatsapp
  • telegram

Contract Faculty: ఒప్పంద అధ్యాపకులకు గండం

* ఎయిడెడ్‌ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఉద్యోగాలకు ఇబ్బందులు

 

 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని 268 మంది ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. తమ పోస్టులను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో వారు ఇంతకాలం నిరీక్షిస్తున్నారు. ఎయిడెడ్‌ అధ్యాపకులు, రెగ్యులర్‌వారి బదిలీలతో వారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తమ ఉద్యోగాలను కాపాడాలంటూ ఒప్పంద అధ్యాపకులు కళాశాల విద్య కమిషనరేట్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. దీంతో అక్టోబరు 08న రాష్ట్రంలో ఆర్జేడీ కార్యాలయాలు, కళాశాలల ఎదుట వారు ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్‌ అధ్యాపకులకు పోస్టింగులను ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌లో ఒప్పంద, పార్ట్‌టైం సిబ్బంది పని చేస్తున్న అన్ని పోస్టులనూ అధికారులు ఖాళీగా చూపారు. దీంతో ఎయిడెడ్‌ సిబ్బంది వెబ్‌ ఐచ్ఛికాలనిచ్చారు. ఎయిడెడ్‌ అధ్యాపకులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతామని, తమను కాపాడాలంటూ ఇటీవల ఒప్పంద సిబ్బంది ఆందోళనలకు పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీరితో చర్చించి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సముదాయించారు. ఆయన హామీ అమలు కావడం లేదని ఒప్పంద అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

వందలాది ఉద్యోగాలు హుష్‌కాకి!

ఖాళీగా చూపిన ఒప్పంద అధ్యాపకుల పోస్టుల్లోకి ఇప్పటికే 150 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను చేర్చుకున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన ఒప్పంద అధ్యాపకులను కళాశాల విద్య కమిషనరేట్‌కు సరెండర్‌ చేశారు. 15-20 రోజులుగా విధుల్లేక వారి పరిస్థితి గాలిలో దీపంలా మారింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకోవడంతో 1,091 మంది ప్రభుత్వంలోకి వచ్చారు. ఒప్పంద అధ్యాపక పోస్టులను మినహాయిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 500 వరకు మాత్రమే ఖాళీలున్నాయి. ఎయిడెడ్‌ నుంచి వచ్చిన వారిలో 145 మందికి స్వయంప్రతిపత్తి కళాశాలల్లో పోస్టింగులనిచ్చారు. దీంతో 30మంది ఒప్పంద అధ్యాపకులు తమ పోస్టులను కోల్పోయారు. తాజాగా మిగతా ఎయిడెడ్‌ బోధన సిబ్బందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారిని చేర్చుకునేందుకు ఒప్పంద అధ్యాపకుల పోస్టులను చూపారు. దీని కారణంగా మరో 88మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులేర్పడ్డాయి. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ నీట్‌, జేఈఈలో విజయానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సరైన ఎంపిక (ప్రకటన)

‣ అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

‣ ఇస్రో, ఐఐఆర్‌ఎస్‌లో 16 జేఆర్‌ఎఫ్‌ పోస్టులు 

‣ ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

‣ అన్ని ఖాళీలకూ వెబ్‌ కౌన్సెలింగ్‌

Posted Date : 08-10-2021