• facebook
  • whatsapp
  • telegram

Medical Courses: ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులకు ఊరట

ఆరేళ్ల ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారికి మన దేశంలో ఇంటర్న్‌షిప్‌నకు అనుమతి

జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయం

వైద్య డిగ్రీ మధ్యలో ఉన్న వారికీ ఇక్కడి ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు! 

 

ఈనాడు, దిల్లీ: యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌ నుంచి అర్థంతరంగా చదువులను వదిలిపెట్టి స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు మన దేశంలోనే ఆయా కోర్సులను పూర్తిచేసే అవకాశం లభించనుంది. అక్కడ ఉత్ఫన్నమైన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు సడలించి అయినా సరే మానవీయ కోణంలో వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఆరేళ్ల ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని ఇంటర్న్‌షిప్‌ మధ్యలో ఉన్న, ప్రారంభించాల్సిన విద్యార్థులకు మన దేశంలోనే ఆ అవకాశాన్ని కల్పించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)నిర్ణయించింది. కొన్ని షరతులకు లోబడి అనుమతించింది. డిగ్రీ వైద్య (ఎంబీబీఎస్‌) విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌ఎంసీ, నీతిఆయోగ్‌, విదేశీవ్యవహారాల, ఆరోగ్య మంత్రిత్వ శాఖల అధికారులు త్వరలో భేటీ కానున్నారు. దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాల్లో వీరికి ప్రవేశాలు కల్పించే యోచనలో ఉన్నారు. దీని కోసం ఎన్‌ఎంసీ నిబంధనలను సడలించే అవకాశం ఉంది.

 

ఇంటర్న్‌షిప్‌ మన దేశంలో చేయాలంటే...

ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ డిగ్రీ ఆరేళ్లు. అది పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్‌ రెండేళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారు అక్కడే ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మన దేశంలో వైద్యుడిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అనుమతించాలంటే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించాలి. అయితే, యుద్ధం వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో... మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ తమ మిగిలిపోయిన ఇంటర్న్‌షిప్‌ను భారత్‌లో పూర్తిచేయడానికి ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే, ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే సదరు విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణులై ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

 ఎన్‌ఎంసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కానీ, తదుపరి పరీక్ష జరిగేలోపు కానీ (ఇందులో ఏది ముందు జరిగితే అంతవరకు) కొన్ని షరతులు, కొలమానాలకు లోబడి.. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల రిజిస్ట్రేషన్‌ మంజూరుకు సంబంధించి రాష్ట్రాల వైద్య మండళ్లు (స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్స్‌)కు అనుమతి ఇచ్చింది.

 వైద్య విద్య పూర్తి చేసినట్లు చెబుతున్న దేశంలో ప్రస్తుతం విద్యార్థి తీసుకొచ్చిన డిగ్రీని రిజిష్టర్‌ చేసుకొనే అర్హత ఉందా? లేదా?అన్నది చూడాలి. ఆ దేశ పౌరులకు వైద్య వృత్తి ప్రాక్టీస్‌ చేసేందుకు ఇచ్చే లైసెన్స్‌కు సమాన హోదా ఈ డిగ్రీకి ఉండాలి.

 ఎంబీబీఎస్‌కు సమానమైన వైద్య విద్యను అభ్యసించినప్పుడు అక్కడ ఇంటర్న్‌షిప్‌ లేదా ఇతర భౌతికపరమైన శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినట్లు పత్రాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌) ఉండాలి.

‣ పాస్‌పోర్టు, వీసా, ఇమిగ్రేషన్‌ వివరాలు తప్పనిసరి.

 భారత్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ తప్పని సరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

 విదేశీ వైద్య విద్యార్థి పైన పేర్కొన్న కొలమానాలను పూర్తి చేస్తే 12 నెలల ఇంటర్న్‌షిప్‌కు కానీ మిగిలిన కాలం ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయడానికి కానీ రాష్ట్ర వైద్య మండళ్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేయొచ్చు.

 వైద్య కళాశాలల ఆసుపత్రులు, వైద్య కళాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే ఇంటర్న్‌షిప్‌ను అనుమతించాలి.

 కేటాయించిన మొత్తం వైద్య సీట్లకు అదనంగా గరిష్ఠంగా 7.5%మంది విదేశీ విద్యార్థులను మాత్రమే ఒక్కో కళాశాలకు ఇంటర్న్‌షిప్‌ కోసం కేటాయించాలి.

 ఇలాంటి విదేశీ వైద్య విద్యార్థుల నుంచి కళాశాలలు ఇంటర్న్‌షిప్‌ కోసం ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు. ఆ మేరకు రాష్ట్ర వైద్య మండళ్లు తమ పరిధిలోని అన్ని కళాశాలల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలి. ఈ విద్యార్థులకు స్టైఫండ్‌, ఇతర సౌకర్యాలను భారతీయ వైద్య విద్యార్థుల తరహాలోనే అందించాలి.

 

2021 నిబంధనలు వారికి వర్తించవు

ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ లైసెన్సియేట్‌ రెగ్యులేషన్స్‌-2021 నిబంధనలు విదేశాల నుంచి 2021 నవంబరు 18కి ముందు వైద్య విద్య పట్టా పొందిన వారికి వర్తించవని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ పేర్కొంది. ఈ నిబంధనల కారణంగా కొన్ని రాష్ట్ర వైద్య మండళ్ల పరిధిలో విదేశీ వైద్య విద్యార్థులు నమోదు చేసుకోవడం కష్టమవుతోందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ స్పష్టత ఇస్తున్నట్లు పేర్కొంది.

 2021 నవంబరు 18కి ముందు విదేశీ వైద్య విద్యాసంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరిన వారికి, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా మినహాయింపునిచ్చిన విదేశీ వైద్య విద్యార్థులక్కూడా ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.

 2021 నవంబరు 18కి ముందు విదేశీ వైద్య డిగ్రీ పొందిన వారు, అంతకముందు విదేశీ విద్యాసంస్థల్లో చేరిన వారికి ‘ది స్క్రీనింగ్‌ టెస్ట్‌ రెగ్యులేషన్స్‌-2022’, ‘ది ఎలిజిబిలిటీ రిక్వైర్‌మెంట్‌ ఫర్‌ టేకింగ్‌ అడ్మిషన్‌ ఇన్‌ యాన్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్స్‌ ఇన్‌ ఎ ఫారిన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ రెగ్యులేషన్స్‌-2022’ మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.

 అయితే, కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ (సీఆర్‌ఎంఐ) నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్‌ 2021 నవంబరు 18న జారీ అయినందున ఆ నిబంధనలు ఆ రోజు నుంచి వర్తిస్తాయని తెలిపింది. దీని ప్రకారం 2021 ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ లైసెన్సియేట్‌ రెగ్యులేషన్స్‌ పరిధిలోకి రానివారంతా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌-1956లోని సెక్షన్‌ 13(3) పరిధిలోకి వస్తారు కాబట్టి వారంతా 2020 సెప్టెంబరు 2న జారీచేసిన అడ్వయిజరీ ప్రకారం భారత్‌లో కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల్లో డిగ్రీ పొందిన తర్వాత ప్రాక్టికల్స్‌ పూర్తి చేయకపోయి ఉంటే ఇక్కడ తప్పని సరిగా ఆ పని చేయాలని స్పష్టం చేసింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

 ఐఐఎం, జమ్మూలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

 ఇంటర్‌ తర్వాత ఐఐఎంలో ఎంబీఏ

 మేం వైద్య కళాశాల ఏర్పాటు చేయవచ్చేమో!

 ఎంబీబీఎస్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

‣ ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.