• facebook
  • whatsapp
  • telegram

Btech Fees: ఫీజులపై ఏఐసీటీఈనే అడుగుదాం

ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో కనుక్కుందాం
టీఏఎఫ్‌ఆర్‌సీ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌, ఇతర కోర్సులకు వార్షిక ఫీజుల ఖరారుపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) త్వరలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి స్పష్టత తీసుకోనుంది. ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సులకు శ్రీకృష్ణ కమిటీ ఏడో కేంద్ర వేతన సంఘం ఆధారంగా ఫీజులను నిర్ణయించింది. రాష్ట్రంలో రెండు, మూడు కళాశాలలు తప్ప ఆ వేతన సంఘం ప్రకారం సిబ్బందికి జీతాలివ్వడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ నిర్దేశించిన ఫీజులను నిర్ణయించడం ఎలా కుదురుతుందని ఏఐసీటీఈని అడగాలని టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన కనిష్ఠ, గరిష్ఠ ఫీజులను కేంద్ర విద్యాశాఖ ఆమోదించిన నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుములను నిర్ణయించాలని రాష్ట్రాలకు ఏఐసీటీఈ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫీజుల ఖరారు ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేసిన టీఏఎఫ్‌ఆర్‌సీ.. దీనిపై గురువారం సమావేశమై చర్చించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ హాజరు కాకపోవడంతో ఆయా అంశాలపై తుది నిర్ణయానికి రాలేకపోయారు. అయితే, ఏఐసీటీఈ నుంచి స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. ఫీజులను ఖరారు చేసేముందు ఏఐసీటీఈ పంపిన ముసాయిదా నివేదిక సమయంలోనే శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను రాష్ట్రంలో అమలు చేయలేమని టీఏఎఫ్‌ఆర్‌సీ లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని పంపింది. దానిపై అక్కడి నుంచి సమాధానం రాలేదు. దీనిపై మరోసారి ఏఐసీటీఈని అడగడంతోపాటు ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. రుసుములపై టీఏఎఫ్‌ఆర్‌సీదే తుది నిర్ణయమని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఇప్పుడు పరిస్థితిపై ఆరా తీయాలని యోచిస్తున్నారు. ఫీజుల నిర్ధారణకు ఇంకా సమయం ఉన్నందున అన్ని కోణాల్లో పరిశీలించాలని భావిస్తున్నారు. బీటెక్‌కు కనీస ఫీజు రూ.79,600 అమలు చేస్తే విద్యార్థులు చేరక గ్రామీణ జిల్లాల్లో కళాశాలలు మూతపడతాయనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మరో వైపు తమకు రూ.35 వేలే చాలని కొన్ని కళాశాలలు ఇప్పటికే లేఖలు ఇచ్చాయి. సమావేశంలో కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, కన్సల్టెంట్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.