• facebook
  • whatsapp
  • telegram

Agnipath: ‘అగ్నిపథ్‌’ ఆవిష్కరణ

* సాయుధ బలగాల్లో షార్ట్‌ సర్వీస్‌ పథకం ప్రారంభం

* నియామక ప్రణాళికను వెల్లడించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

 

 

దిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘అగ్నిపథ్‌’ పేరుతో షార్ట్‌ సర్వీసు పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి జూన్‌ 14న ఆవిష్కరించారు.

 

90 రోజుల్లో తొలి ర్యాలీ..

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం నేడు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్‌ పథకంతో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. అంతేగాక, దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి’’ అని చెప్పుకొచ్చారు. అగ్నిపథ్ నియామకాల కోసం టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.
తొలి బ్యాచ్‌లో 45వేల మంది యువతను నియమించుకోనున్నారు. అగ్నిపథ్‌ సర్వీసులో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి.. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ ఇస్తారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ మంజూరుతో పాటు పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

 

అగ్నివీరులకు సదుపాయాలు ఇలా..

వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ప్రతిబ్యాచ్‌లో 25శాతం మందికే ఈ అవకాశం దక్కుతుంది. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్‌, యూనిట్‌, సంస్థలో పోస్టింగ్‌తో పాటు సైనిక బలగాల తరహాలో ర్యాంకు ఇస్తారు. సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తనవంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

‣ ఇంటర్‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.