• facebook
  • whatsapp
  • telegram

CSE Course: కంప్యూటర్‌ సైన్స్‌కే జై!

రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి రానున్న సీట్లు 6,210

ఈనాడు, హైదరాబాద్‌: మెకానికల్‌.. సివిల్‌.. ఎలక్ట్రికల్‌.. ఎలక్ట్రానిక్స్‌.. ఒకప్పుడు ఇంజినీరింగ్‌ అంటే ప్రధానంగా ఈ బ్రాంచీలే. కానీ ఇప్పుడు బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. విద్యార్థుల డిమాండ్‌ దృష్ట్యా సంప్రదాయ కోర్సులకు స్వస్తి పలికి కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సులను ఇంజినీరింగ్‌ కళాశాలలు తీసుకువస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరంలో కంప్యూటర్‌ సైన్స్‌లో కొత్తగా 6,210 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గత విద్యా సంవత్సరంలో 85,500 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. అందులో కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సులో 43,000 సీట్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 49,000పైగానే ఉండనుంది. 2022-23 సంవత్సరానికి సీట్లు బదలాయించుకునేందుకు 104 ఇంజినీరింగ్‌ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ విభాగాల్లో కోర్సులు తగ్గించుకుని కంప్యూటర్‌ సైన్స్‌లో పెంచుకునేందుకు అనుమతి కోరాయి. పరిశీలించిన జేఎన్‌టీయూ అధికారులు కంప్యూటర్‌ సైన్స్‌లో సీట్లు పెంచుకునేందుకు పలు కళాశాలలకు ఎన్‌వోసీలు జారీ చేశారు. ఈ క్రమంలో అవి కోర్‌ సీఎస్‌ఈతోపాటు సీఎస్‌ఈ-కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌), సైబర్‌ సెక్యూరిటీ, డాటాసైన్స్‌, ఐటీ బ్రాంచీల్లో సీట్లు భారీగా పెంచుకున్నాయి. వచ్చే నెలలో జేఎన్‌టీయూ కళాశాలల తనిఖీకి సిద్ధమవుతోంది. వసతులు పరిశీలించి వాటికి గుర్తింపు ఇవ్వనుంది.
ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో భారీగా తగ్గుదల
మొత్తం 66 కళాశాలలు 130 కోర్సుల పరిధిలో 6,100 సీట్లు తగ్గించుకున్నాయి. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లోనే తగ్గాయి. తర్వాత మెకానికల్‌, సివిల్‌ బ్రాంచీలున్నాయి. కొన్నేళ్లుగా ఆయా కోర్సులకు డిమాండ్‌ లేకపోవడంతో సీట్లు భారీగా తగ్గించుకున్నాయి. కొన్ని కళాశాలలు మెకానికల్‌, సివిల్‌లో 30 సీట్లకే పరిమితం చేసుకున్నాయి.
కోర్సులు ఎత్తివేయడానికి వీల్లేదు: ప్రొ.మంజూర్‌హుస్సేన్‌, రిజిస్ట్రార్‌, జేఎన్‌టీయూ
సంప్రదాయ కోర్సులు కాపాడుతూనే డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వాటికి అనుమతించాం. డిమాండ్‌ లేదంటూ మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులు పూర్తిగా ఎత్తివేయడానికి వీల్లేదు. వాటిలో కనీసం 30 సీట్లు ఉండాలనే నిబంధన విధించాం. కొత్తగా బ్రాంచీకి అనుమతి ఇచ్చిన చోట గరిష్ఠంగా 60 సీట్లకే ఆమోదం తెలిపాం.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

‣ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

‣ మెరుగైన మార్కులు ఎలా?

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.