• facebook
  • whatsapp
  • telegram

Inter New Colleges: కొత్త కళాశాలల ఏర్పాటు ఎప్పటికి?

ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు మొదలైనా ప్రారంభం ఊసే లేదు
అధ్యాపకుల నియామకాల్లోనూ నిర్లక్ష్యమే
అనాలోచితంగా కొన్ని జిల్లాల్లో కో-ఎడ్యుకేషన్‌ రద్దు

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యా శాఖ.. ఇంటర్‌ విద్యా శాఖ మధ్య సమన్వయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 436 ప్రభుత్వ బాలికల కళాశాలలను ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వీటిల్లో కొన్ని ఉన్నత పాఠశాలల్లో, మరికొన్ని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా ల్లో (కేజీబీవీ)ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ఏర్పాటు కొలిక్కి రాకుండానే ఇంటర్‌ విద్యామండలి మొదటి ఏడాది ప్రవేశాలకు ప్రకటన ఇచ్చేసింది. అధికారుల హడావుడి నిర్ణయాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త కళాశాలలో చేరేందుకు వేచిచూడాలో.. లేక మరో కళాశాలకు వెళ్లాలో  తెలియక గందరగోళపడుతున్నారు. కళాశాలలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించిన అధికారులు వీటిల్లో బోధించేందుకు లెక్చరర్లను మాత్రం నియమించలేదు. స్కూల్‌ అసిస్టెంట్లకే పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించినా ఇంతవరకు ఈ ప్రక్రియనే ప్రారంభించలేదు. ఇంటర్‌ విద్యామండలి ప్రకటన ప్రకారం జులై ఒకటి నుంచే తరగతులు ప్రారంభం కావాలి. కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించాల్సి ఉన్నా ఇందుకు ప్రకటన ఇవ్వలేదు. 
లెక్చరర్లు లేకుండా కళాశాల ఎలా?
ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, బాలికలకు ప్రత్యేకంగా ఒకటి ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కొత్త జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా బాలికల జూనియర్‌ కళాశాలలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైస్కూల్‌లో ఇంటర్మీడియట్‌ ఏర్పాటు చేసి వాటిని హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తారు. ఇలా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేయాల్సి ఉంది. అలాగే మరో 131 కేజీబీవీల్లోనూ ఇంటర్‌ ప్రారంభించనున్నారు. ఇవి కాకుండా ఒకే మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్న 13 చోట్ల ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్పు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మండలాలను గుర్తించారు. అయితే వీటిల్లో పాఠాలు చెప్పే అధ్యాపకులను మాత్రం నియమించలేదు. హైస్కూల్‌ ప్లస్‌లో స్కూల్‌ అసిస్టెంట్లకే పదోన్నతి కల్పించి, అధ్యాపకులుగా నియమించాలని భావించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ మిగులు పోస్టులను తేల్చేందుకు హేతుబద్దీకరణ చేపట్టారు. ఇది పూర్తి అయిన తర్వాత పదోన్నతులు చేపడతారని చెబుతుండగా ఇంటర్‌ విద్యా మండలి మాత్రం ప్రవేశాలకు ప్రకటన జారీ చేసింది. ఈనెల 20 నుంచి దరఖాస్తులు విక్రయించాలని, 27నుంచి ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. జులై ఒకటి నుంచి తరగతులు చేపట్టాలని పేర్కొంది. 
అబ్బాయిలకు ఇబ్బందులు..
ఇంటర్‌ విద్యాశాఖ అనాలోచిత నిర్ణయం కారణంగా అబ్బాయిలకు చదువుకునేందుకు కళాశాల లేకుండాపోయింది. ఈ నెల 6న రాష్ట్రంలోని 25 కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలను బాలికల కళాశాలలుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు ప్రభుత్వ కళాశాలలు ఉంటే ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్పు చేయాల్సి ఉండగా.. ఒక్క కళాశాల ఉన్నచోట సైతం కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ప్రభుత్వ వృత్తివిద్య, సాధారణ కో-ఎడ్యుకేషన్‌ కళాశాల ఉండగా.. సాధారణ కళాశాలను బాలికల కళాశాలగా మార్పు చేశారు. ఇక్కడ చదివే అబ్బాయిలు ఇప్పుడు చేరితే వృత్తి విద్యలో చేరాలి. లేదంటే వేరే మండలానికి వెళ్లాల్సిందే. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేటల్లో ఉర్దూ మాధ్యమం కళాశాలతోపాటు మరో కో-ఎడ్యుకేషన్‌ కళాశాల ఉండగా.. కో-ఎడ్యుకేషన్‌ను బాలికలకు కేటాయించారు. దీంతో ఇక్కడ చదువుతున్న వందలాది మంది అబ్బాయిలు మరో 10-15కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ కళాశాలకు వెళ్లాల్సిందే. అన్నమయ్య జిల్లా కలికిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కుప్పంలోని ఎక్కువ మంది విద్యార్థులున్న కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలను బాలికల కళాశాలగా మార్పు చేశారు. దీంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు 12కిలోమీటర్ల దూరంలోని మల్లనూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలానికి రెండు కళాశాలలు ఉన్న జాబితా పంపాలని ఇంటర్‌ విద్యాశాఖ కోరడంతో క్షేత్రస్థాయి అధికారులు ఏమి పరిశీలించకుండా ఉర్దూ, వృత్తి విద్య కళాశాలలను పరిగణనలోకి తీసుకుని జాబితా పంపారు. దీంతో కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలను బాలికల కళాశాలలుగా మార్చేశారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ చక్కెర కోర్సులు చక్కని కొలువులు

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.