ఎస్సై ఉద్యోగాలకు 2.45 లక్షల మంది, కానిస్టేబుల్‌కు 6.50 లక్షల మంది పోటీ
ఈనాడు, హైదరాబాద్: పోలీస్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన ఎస్సై, 21న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. రెండు పరీక్షలూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతాయి. ఎస్సై ఉద్యోగాలకు సుమారు 2,45,000 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుమారు 6,50,000 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎస్సై పరీక్షను హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో, కానిస్టేబుల్ పరీక్షను హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 40 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
‣ ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తుది పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. ఒకేసారి లక్షల మంది అభ్యర్థులు పాల్గొననుండటంతో పరీక్షలకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించారు. అభ్యర్థులకు సమీపంలోని కేంద్రాలనే కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సన్నద్ధమవుతున్న అభ్యర్థులు
గత ఏప్రిల్ 25వ తేదీన పోలీస్ నియామకాలకు ప్రకటన వెలువడినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరే ప్రభుత్వ శాఖలో లేనివిధంగా పోలీస్ శాఖలో ఏకంగా 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తుండటంతో ఎక్కువ మంది వీటికే పోటీ పడుతున్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ నియామకాలు భిన్నంగా ఉంటాయి. ఇందులో రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షల్లోనూ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. గతంలో అభ్యర్థులను వడపోసే ఉద్దేశంతో తొలుత 5 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించేవారు. అందులో దాదాపు సగం మంది అభ్యర్థులే తదుపరి పరీక్షలకు అర్హత సాధించేవారు. ఇప్పుడు దేహదారుఢ్య పరీక్షలను చివర్లో నిర్వహిస్తున్నారు. తొలుత నిర్వహించనున్న రాతపరీక్షలకు హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి చోట్ల ఏర్పాటు చేసిన ప్రైవేట్ శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాథమిక రాతపరీక్షల తేదీలు వెలువడటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
హాల్‌టికెట్ల డౌన్లోడ్
ఎస్సై అభ్యర్థులు జులై 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి నియామక మండలి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రాథమిక రాత పరీక్షలకు సిలబస్ ఇదే..
కానిస్టేబుల్ పోస్టులు (సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, టీఎస్ఎస్పీ, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక, వార్డర్ స్త్రీ, పురుషులు) ఈ పరీక్షకు సిలబస్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. 200 ప్రశ్నలుంటాయి. ఆంగ్లం, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర- సంస్కృతి- జాతీయ ఉద్యమం, భారతదేశ భౌగోళిక స్వరూపం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆబ్కారీ, రవాణా శాఖల కానిస్టేబుల్ సిలబస్..
200 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఆంగ్లం, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, రాజకీయ, అర్థశాస్త్రం, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, టెస్ట్ఆఫ్రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఎస్సై (సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, డిప్యూటీ జైలర్) రాతపరీక్షల సిలబస్ ఇలా...
ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. అరిథ్‌మెటిక్/మెంటల్ ఎబిలిటీపై 100 ప్రశ్నలు, జనరల్ స్టడీస్‌పై 100 ప్రశ్నలుంటాయి. జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, రాజకీయ అంశాలు, దేశ భౌగోళిక స్వరూపం, జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక- ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
********************************************************
స్టడీ మెటీరియల్ - ప్రిలిమ్స్
‣ ఇంగ్లిష్
‣ అర్థమెటిక్
‣ జనరల్ సైన్స్
‣ భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
‣ భారతదేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ
‣ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు
‣ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
‣ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
స్టడీ మెటీరియల్ - మెయిన్స్
‣ పేపర్ - 1: ఇంగ్లిషు
‣ పేపర్ : 2: తెలుగు
‣ పేపర్ - 3: అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ
‣ పేపర్ - 4: జనరల్ స్టడీస్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.