• facebook
  • whatsapp
  • telegram

Students: విద్యార్థులే ఉద్యోగులు!

విజయవాడలో విస్తరించిన సేవా రంగం
ఈనాడు, అమరావతి: ‘కొవిడ్‌ దెబ్బకు మధ్యతరగతి, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. దీంతో అనేకమంది విద్యార్థులు చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు చదువుకుంటూ వారికి ఖాళీ ఉన్న సమయాల్లో కొలువులు చేసుకునే సౌలభ్యం ఉన్న అనేక అవకాశాలు ప్రస్తుతం విజయవాడలో అందుబాటులోనికి వచ్చాయి. ప్రధానంగా నగరవాసులకు అవసరమైన సేవలను అందిస్తూ.. ఎవరి సహాయం లేకుండా తమ చదువులకు అవసరమైన ఫీజులను కట్టుకుంటున్నారు. ఆహారాన్ని ఇంటికి చేర్చే.. స్విగ్గి, జొమాటో, ఊబర్‌ ఈట్‌ లాంటివి, ప్రయాణికులను గమ్యస్థానం చేర్చే.. ర్యాపిడో, ఓలా బైక్‌, ఉబర్‌ లాంటి సంస్థలు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌, బిగ్‌బాస్కెట్‌తో సహా పదుల సంఖ్యలో ఈకామర్స్‌ సంస్థల సేవలు అందుబాటులోనికి వచ్చాయి. ఇంకా అనేక కొత్త సంస్థలు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ సంస్థల్లో పనిచేవాళ్లలో అత్యధికమంది విద్యార్థులే కావడం గమనార్హం.’
కొవిడ్‌ తర్వాత ఈకామర్స్‌ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే తమ సేవలను అందిస్తున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే కనీసం 50వేల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోంలో ఉంటారు. అందుకే ఈకామర్స్‌ సంస్థల సేవలకు బాగా గిరాకీ పెరిగింది. ఆహారం, ప్రయాణం, వైద్యం, ఇంటికి అవసరమయ్యే నిత్యవసరాలు ఇలా.. అన్నీ ఇంటికే తెప్పించుకుంటున్నారు. దీంతో పార్ట్‌టైంలో కొలువులు చేయాలనుకునే విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం విజయవాడ నగరంలోని కేబీఎన్‌, ఎస్‌ఆర్‌ఆర్‌, లయోలా, సిద్ధార్థ లాంటి అన్ని కళాశాలల్లోనూ వందల మంది విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్‌టైం కొలువులు చేసుకుంటున్నారు.
వాళ్లు కూడా..
ఎవరికి ఖాళీ ఉన్న సమయంలో వాళ్లు పనిచేసుకునే వెసులుబాటును ఈ సంస్థలు కల్పిస్తున్నాయి. ఫుల్‌టైం ఉద్యోగాలు చేసేవాళ్లు సాయంత్రం నుంచి ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో విద్యార్థులు రంగంలోనికి దిగి.. రాత్రి వరకూ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోనే హోటళ్ల నుంచి ఆహారం తెప్పించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. ప్రస్తుతం చదువులు పూర్తిచేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువత కూడా వీటిలో చేరుతున్నారు. సరైన ఉద్యోగం వచ్చేలోగా ఖాళీగా ఉండకుండా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు విజయవాడకు చెందిన రఘునాథ్‌ వెల్లడించారు. ప్రైవేటు కొలువులు చేస్తున్న వాళ్లు, దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్లు.. కూడా చాలామంది ఈ సంస్థల్లో సాయంత్రం నుంచి సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు ఖాళీ ఉంటే.. అప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌ చేస్తే.. చాలు. ఉపాధి వెతుక్కుంటూ వస్తోందని ఓ యువకుడు చెప్పారు.
పోటీ పెరిగి సేవల విస్తరణ..
విద్యార్థులే ఒకరి ద్వారా మరొకరు రిఫరెన్స్‌లు ఇచ్చుకుంటూ ఆయా సంస్థల్లో చేరుతున్నారు. కొన్ని సంస్థలు నగరంలో పెద్దపెద్ద హోర్డింగులను కూడా ఏర్పాటు చేశాయి. మీ చేతిలో ఒక ద్విచక్రవాహనం ఉంటే మాతో కలిసి పనిచేసుకోవచ్చంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈకామర్స్‌ సేవలను అందించే సంస్థల మధ్య కూడా పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో.. ఒకవైపు కమీషన్లు పెంచుతూ, మరోవైపు సేవలను విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు చిన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ నుంచి ఏది కావాలన్నా ఇంటికే తెచ్చి ఇచ్చేలా సేవలను విస్తరించాయి. ఉదయం కళాశాలకు వెళుతూ.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఓ నాలుగైదు గంటలు పనిచేసి.. నెలకు కనీసం ఓ రూ.10-15వేలు సంపాదించుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం వేల మంది ఉన్నారు.
ఎంత సమయం పనిచేస్తే అంత..
ఈ నూతన ఉపాధి రంగంలో ఎవరి అవసరాన్ని బట్టి వాళ్లు పనిచేస్తూ ఆదాయం పొందొచ్చు. ఒక విద్యార్థి రోజుకు కేవలం మూడు గంటలే పనిచేసి తర్వాత తన చదువుపై ధ్యాస పెట్టుకుంటాడు. మరొకరు పది గంటలు పనిచేస్తుంటారు. ఎవరు ఎంత సమయం పనిచేశారనే దాని ఆధారంగానే ఆదాయం కూడా వస్తోంది. ఒక్కో పార్సిల్‌ డెలివరీ, లేదంటే.. బైక్‌ డ్రాపింగ్‌ ఆధారంగా కమీషన్‌ వస్తుంది. ఒక్కో డెలివరీకి రూ.30 నుంచి రూ.50 వరకూ కమీషన్‌ ఇస్తారు. కొవిడ్‌ తర్వాత డెలివరీ బాయ్‌లకు టిప్‌లు కూడా ఇవ్వొచ్చంటూ చాలా సంస్థలు అధికారికంగా తమ యాప్‌లలో ఆప్షన్‌ను పెట్టాయి. ఇవికూడా ప్రస్తుతం ఎక్కువగానే వస్తున్నాయి. ఈ టిప్‌లను ఎవరికి నచ్చినంత వాళ్లు ఇస్తుంటారు. ఒక్కో విద్యార్థి నెలకు కనీసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఈ పార్ట్‌టైం కొలువల ద్వారానే సంపాదిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం కేవలం ఈ సంస్థలపై ఆధారపడి నడిచే హోటళ్లు కూడా కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.