• facebook
  • whatsapp
  • telegram

Schools upgraded: ఈ బ‌డులే క‌ళాశాల‌లిక‌

* కృష్ణాలో 24, ఎన్టీఆర్‌ జిల్లాలో 16 ఎంపిక

* బాలికలకు బైపీసీ, ఎంపీసీ ప్రవేశాల కల్పన

* విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశాలు

 

ఈనాడు, అమరావతి: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 40 ఉన్నత పాఠశాలలను ఈ ఏడాది నుంచి కళాశాలలుగా మార్చేందుకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. కృష్ణా జిల్లాలోని 24, ఎన్టీఆర్‌ జిల్లాలోని 16 ఉన్నత పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. ఈ కళాశాలల్లో బాలికలకు ఇంటర్మీడియట్‌ విద్యను బోధించనున్నారు. ఈ ఏడాది ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపులకు ప్రవేశాలు కల్పించనున్నారు. దీనికోసం ఆయా పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలంటూ డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, తిరువూరు, వత్సవాయి, వీర్లుపాడు, విస్సన్నపేట, నిడమానూరు ఈ 13 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యను కూడా బోధించనున్నారు. విజయవాడ నగరంలోని గవర్నరుపేటలో ఉన్న సి.వి.ఆర్‌.జి. హైస్కూల్, అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎం.కె.భేగ్, పటమటలోని కె.ఎస్‌.ఆర్‌.జెడ్పీ ఈ మూడు పాఠశాలల్లోనూ బాలికలకు ఇంటర్‌ ప్రవేశాలు కల్పించనున్నారు. 2022-23 ఏడాదికి సంబంధించి ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో విద్యార్థినులను చేర్చేందుకు ఆయా పాఠశాలల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది విద్యార్థినులను ఇంటర్‌లో చేరేటట్టు చూడాలంటూ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులకు సూచించారు. 

కృష్ణా జిల్లాలో ఇవే..

కృష్ణా జిల్లాలోని 24 పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి బాలికలకు ఇంటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నారు. జిల్లాలోని అవనిగడ్డ, బంటుమిల్లి(పెదతుమ్మిడి), బాపులపాడు, చల్లపల్లి(పురిటిగడ్డ), గన్నవరం, గంటసాల, గుడివాడ(ఎస్‌పీఎస్‌ ఎంపీఎల్‌ హైస్కూల్‌), గుడ్లవల్లేరు(అంగళూరు), గూడురు(మళ్లవోలు), కంకిపాడు(పునాదిపాడు), కోడూరు(స్వతంత్రపురం), కృత్తివెన్ను(మోపిదేవి), మొవ్వ(నిడమోలు), నాగాయలంక, నందివాడ, పామర్రు(అడ్డాడ), పమిడిముక్కల, పెడన(చెన్నూరు), పెదపారుపూడి, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు(తేలప్రోలు), ఉయ్యూరు(కాటూరు) ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి ఎంపీసీ, బైపీసీ ప్రవేశాలు ఈ పాఠశాలల్లో కల్పించనున్నారు. 

ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన..

తరగతి గదుల కొరతలేని పాఠశాలలనే ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాల కోసం ఎంపిక చేశారు. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులతోనే తాత్కాలికంగా ఇంటర్‌ తరగతులను కూడా బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌కు పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది వచ్చేవరకూ ఉన్న వారితోనే కొనసాగించనున్నారు. కానీ.. ఇది ఎంతవరకూ సత్ఫలితాలు ఇస్తుందనేది సందేహాస్పదమే. ప్రస్తుతం చాలాచోట్ల ఉన్నత పాఠశాలల్లోనే సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇంటర్‌ విద్యను కూడా బోధించాలంటే.. తలకుమించిన భారంగానే మారుతుంది. 

ల్యాబ్‌లు, గ్రంథాలయాల కోసం..

ఎంపీసీ, బైపీసీ ప్రవేశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ల్యాబ్‌లు, గ్రంథాలయాల అవసరం ఉంటుంది. అందుకే.. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లు, గ్రంథాలయాలను ఇంటర్‌ విద్యార్థినుల కోసం కూడా అనువుగా ఉండేలా సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాఠశాలల్లో ల్యాబ్‌లు, గ్రంథాలయాలు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దగ్గరిలో ఉన్న మోడల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఉండే ల్యాబ్‌లను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆదేశించారు.  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.