• facebook
  • whatsapp
  • telegram

AP Schools: బడుల విలీనంపై తల్లిదండ్రుల మండిపాటు

చందర్లపాడు, న్యూస్‌టుడే: పాఠశాలల విలీనంపై తల్లిదండ్రులు భగ్గుమన్నారు. తుర్లపాడు మెయిన్‌, హెచ్‌డబ్ల్యూ, చందర్లపాడు మెయిన్‌, ఎస్టీ, ఎస్టీఏ పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులు జులై 11న‌ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌) గేటుకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ బడేమియా.. తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో తాళం వేసి ఉపాధ్యాయులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చందర్లపాడులోని ప్రధానోపాధ్యాయులకు, మండల అధికారులకు తల్లిదండ్రులు వినతిపత్రాలు అందజేశారు.
పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ‘మా బడి మాకే కావాలి, ఎక్కడికి తరలించొద్దు’ అంటూ కొణకంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొణకంచి ప్రాథమిక పాఠశాలను స్థానిక జడ్పీ హైస్కూల్లో విలీనం చేసింది. ఆ ప్రక్రియను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నాడు-నేడు కింద సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి సుందరీకరణ చేసిన పాఠశాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పాఠశాల తమ పిల్లలకు అందుబాటులో ఉందని, ఊరికి దూరంగా ఉన్న జడ్పీ హైస్కూల్లోకి మార్చడం వల్ల చిన్నారులు అంతదూరం వెళ్లలేరని అన్నారు. హైస్కూల్‌ పక్కనే చెరువు ఉందని, పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
తిరువూరు, న్యూస్‌టుడే: స్థానిక రాజుపేట, ఎమ్మార్సీ కార్యాలయం సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో విలీనం చేయడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందుబాటులో ఉన్న పాఠశాలలను తీసుకెళ్లి దూరంగా ఉన్న బాలికోన్నత పాఠశాలలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట అభ్యుదయ పాఠశాల విద్యార్థులు, రాజుపేట ఎస్సీ కాలనీ ఆదర్శ పాఠశాల ఎదుట అక్కడ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.