విధివిధానాలు తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ
మంత్రి కేటీఆర్ వెల్లడి
ఐరాస్తే తెలంగాణ, బోధ్యాన్, మైక్రోల్యాబ్స్ ప్రాజెక్టులకు శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: కృత్రిమ మేధ ప్రాథమికాంశాలపై నైపుణ్యాలు పెంచేందుకు ఈ ఏడాది లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీనికి తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ (టాస్క్), ఇంటెల్ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో 25 వేల మంది విద్యార్థులు, 4,500 మందికిపైగా బోధన సిబ్బందికి నైపుణ్యాలు కల్పించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ఐహబ్-డాటా సెంటర్, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్, ఇంటెల్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ఐరాస్తే-తెలంగాణ, బోధ్యాన్, మైక్రోల్యాబ్స్ ప్రాజెక్టులను జులై 12న ట్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో కృత్రిమ మేధపై విధివిధానాలు తీసుకువచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం వ్యవసాయ డాటా యాజమాన్య విధానం తీసుకొచ్చింది. కృత్రిమ మేధ సాయంతో సాగు..బాగు ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 50 వేల మంది రైతులకు సాంకేతిక సహకారం అందించనున్నాం. సరికొత్త సాంకేతికతలు గ్రామస్థాయిలో ఉండే సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్‌కు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం. ఏటా రోడ్డు ప్రమాద బాధితులకు టీఎస్ఆర్టీసీ రూ.50 కోట్ల పరిహారం చెల్లిస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థకు అదెంతో భారం. ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (ఐరాస్తే-తెలంగాణ) సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని వివరించారు.
‣ ట్రిపుల్ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్ మాట్లాడుతూ.. వర్సిటీలోని కోహ్లి పరిశోధన కేంద్రం సాయంతో కృత్రిమ మేధపై విశేష పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటెల్ భారత్ విభాగాధిపతి నివృతిరాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకచోట ప్రమాదకారక ప్రదేశం ఉందన్నారు. ఐరాస్తే తెలంగాణ ప్రాజెక్టుతో వీటిని గుర్తించి పరిష్కరించే వీలు చిక్కుతుందన్నారు. ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంచాలకురాలు రమాదేవి, ఉబర్ భద్రత విభాగాధిపతి సూరజ్నాయర్, టీఎస్ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్, ఐజీఐబీ ఇన్‌ఛార్జి సంచాలకుడు హేమంత్ కె.గౌతమ్, ట్రిపుల్ఐటీ కో ఇన్నోవేషన్ రమేశ్ లోగనాథన్, ఆర్ అండీ డీ డీన్ సీవీ జవహర్, ఐహబ్ అధిపతి దేవప్రియ కుమార్ పాల్గొన్నారు.
ఏమిటీ సాంకేతికతలు!
1.ఐరాస్తే తెలంగాణ: ఇంటెల్ తయారు చేసిన సెన్సర్లను జాతీయ రహదారులపై ప్రయాణించే 200 ఆర్టీసీ బస్సులలో అమర్చుతారు. ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న సమయాల్లో ఇవి బీప్ శబ్ధం చేసి డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయి. ఆయా ప్రమాదకారక ప్రాంతాలను గుర్తించి క్లౌడ్‌లో నిక్షిప్తం చేసి విశ్లేషించేందుకు వీలుంటుంది.
2. మైక్రో ల్యాబ్స్: రాష్ట్రంలోని 20 జిల్లా ఆసుపత్రుల నుంచి సేకరించిన వైరస్, బ్యాక్టీరియా జన్యు విశ్లేషణ చేసి డాటా నిక్షిప్తం చేస్తారు. కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తులో ఆయా సూక్ష్మజీవుల జాతులను గుర్తించే వీలు కలుగుతుంది.
3. బోధ్యాన్: కారుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలు, రాడార్లు, లైడార్ల సాయంతో మన రోడ్ల స్థితిగతుల సమాచారం సేకరించి ప్రమాదాలు తగ్గించే సాంకేతికతలు అభివృద్ధి చేస్తారు. డ్రైవర్ రహిత కార్ల తయారీకి వినియోగించుకోవచ్చు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఈడీ, జూనియర్ అసిస్టెంట్స్ పరీక్షలకు ఇదుగో వ్యూహం
‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.