గణితం ప్రశ్నలతోనే విద్యార్థులకు తిప్పలు
ఈనాడు, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో మొదలైన తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు తొలిరోజు జులై 18న 91.40 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 94.80 శాతం, ఏపీలో 78 శాతం మంది పరీక్ష రాశారు. మొత్తం 58,548 మందికి 53,509 మంది హాజరయ్యారు. పరీక్ష హాజరుపై వర్షాలు, వరదల ప్రభావం కనిపించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, కన్వీనర్ గోవర్ధన్ తదితరులు వర్సిటీలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. మానవతా దృక్పథంతో ఈసారి కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణితంలో 80 ప్రశ్నలకు 10-15 పెద్దవిగా ఉన్నాయని, దానివల్ల వాటిని చదివి అర్థం చేసుకొని జవాబును గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టిందని పలువురు విద్యార్థులు చెప్పినట్లు జేఈఈ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. భౌతికశాస్త్రంలో రెండు, రసాయన శాస్త్రంలో ఒకటీరెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఐచ్ఛికాల్లో లేనట్లు తమ విద్యార్థులు చెప్పారన్నారు.
ఓ పరీక్ష కేంద్రంలో గంట ఆలస్యంగా..
వరంగల్ రంగశాయిపేట శివారులోని గణపతి ఇంజినీరింగ్ కళాశాలలో జులై 18న ఉదయం పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఎంసెట్ ఆన్లైన్ పరీక్ష గంట ఆలస్యంగా మొదలైంది. అందుబాటులో ఉంచిన జనరేటర్ సైతం మొరాయించడంతో మరొకదాన్ని తెప్పించి విద్యుత్తును పునరుద్ధరించారు. మధ్యాహ్నం 12 గంటలకు ముగియాల్సిన పరీక్ష ఒంటిగంటకు పూర్తయింది.
డీఈఈసెట్కు 11,680 దరఖాస్తులు
రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 23న నిర్వహించనున్న డీఈఈసెట్కు ఈసారి 11,680 మంది దరఖాస్తు చేశారు. గతేడాది వాటి సంఖ్య 7,591 మాత్రమేనని, అంటే 60% పెరిగాయని కన్వీనర్ శ్రీనివాసాచారి ‘ఈనాడు’కు తెలిపారు. పోయిన సంవత్సరం కరోనా కారణంగా దరఖాస్తులు తగ్గిపోయాయని, ఈసారి మళ్లీ పుంజుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.