• facebook
  • whatsapp
  • telegram

Teacher Posts: పార్ట్‌ టైమ్‌ గురువుల నియామకాలేవీ?

బడులు తెరిచి నెల దాటినా విధుల్లోకి తీసుకోని విద్యాశాఖ
జూనియర్‌ కళాశాలల్లోనూ అదే దైన్యం
ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల స్థాయిలో పిల్లల్లో సృజనాత్మకత పెంచేందుకు కళలు, క్రీడలను విద్యలో అంతర్భాగం చేయాలి..జాతీయ విద్యావిధానం చేసిన తీర్మానమిది.
 పాఠశాలల్లో కళల విద్యను ప్రోత్సహించాలి.. ఉన్నత విద్యలో అవసరమైతే ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలనే స్థాపించాలి.. పార్లమెంటరీ కమిటీ ఇటీవల చేసిన సిఫారసు ఇది.
‣ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది. కొత్తవారి సంగతి అటుంచితే.. ఎన్నో ఏళ్లుగా పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట ఆర్ట్‌, క్రాఫ్ట్స్‌, వ్యాయామవిద్య ఉపాధ్యాయులు(పీఈటీలు)గా పనిచేస్తున్న వారిని విధుల్లోకి తీసుకోవడంలో పాఠశాల విద్యాశాఖ జాప్యం చేస్తోంది. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల దాటినా వారిని ఈసారి విధుల్లోకి తీసుకోలేదు.1785 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2,343 మంది తాత్కాలిక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో 751 మంది ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌, 1211 మంది వర్క్‌ ఎడ్యుకేషన్‌(క్రాఫ్ట్స్‌), మరో 381 మంది పీఈటీలుగా పనిచేస్తున్నారు. వారికిచ్చే వేతనం రూ.11,700 మాత్రమే. గత విద్యా సంవత్సరం(2021-22) సెప్టెంబరులో మొదలుకాగా వారిని డిసెంబరులో విధుల్లోకి తీసుకోవడం గమనార్హం.
వేతనాల్లో 60 శాతం కేంద్రం నుంచే...
సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద కేంద్ర ప్రభుత్వం పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్ల వేతనాల్లో 60 శాతం ఇస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 4,500 ప్రభుత్వ హైస్కూళ్లలో వారిని నియమించాలి. కానీ, సగం బడుల్లోనూ నియామకాలు లేవు. విద్యాశాఖ వర్గాలేమో వారి నియామకాలకు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందంటున్నాయి. తమ నియామకాలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా ప్రయోజనం లేదని ఆర్ట్స్‌ ఉపాధ్యాయుల సంఘం నేత కేశవకుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు.
కళాశాలల్లో పనిచేస్తున్నా..
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1654 మంది అతిథి అధ్యాపకులు(గెస్ట్‌ లెక్చరర్లు) పనిచేస్తున్నారు. కాలేజీలు ప్రారంభమై నెల దాటినా వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు రాలేదు. తమను విధుల్లోకి తీసుకుంటారని భావించిన ఆ అధ్యాపకులు విధులకు హాజరై పాఠాలు బోధిస్తున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి, ఏప్రిల్‌, మే నెలల వేతనాలు అందలేదని అతిథి అధ్యాపకుల ఐకాస రాష్ట్ర నేత దేవేందర్‌యాదవ్‌ తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.