• facebook
  • whatsapp
  • telegram

Schools: భయం భయంగా బడికి..!

ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లు దాటి పాఠశాలలకు
కనీస ఏర్పాట్లు చేయని బల్దియా యంత్రాంగం
ఇది లింగంపల్లి స్టేషన్‌ వద్ద పరిస్థితి. నిత్యం విద్యార్థులు ఇక్కడ రోడ్డు దాటేందుకు సర్కస్‌ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి. వందలాది మంది విద్యార్థులు ఒకవైపు నుంచి మరోవైపునకు ఉదయం, సాయంత్రం వేళ ఎదురుగా ప్రమాదకరంగా వచ్చే వాహనాలను తప్పుకొని.. డివైడర్‌ దాటుకుంటూ వెళుతున్నారు. విద్యార్థుల పరిస్థితి తలచుకుని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్‌: రయ్‌మంటూ దూసుకొచ్చే వాహనాలు.. అడుగు వేయాలంటే భయం.. తల్లిదండ్రుల చేయి పట్టుకుని బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు నిత్యం రోడ్లు దాటుతున్నారు. పాఠశాలల వద్ద పరిస్థితులు ప్రమాదకరంగా తయారయ్యాయి. పాఠశాలల వద్ద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడం, ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్న ఘటనలు కనిపించాయి.
నిత్యం పాఠశాలలకు పిల్లలను బస్సులు లేదా ప్రైవేటు వాహనాలు లేదా తల్లిదండ్రులు తమ వాహనాల్లో తీసుకువచ్చి దించుతుంటారు. కొందరు తల్లిదండ్రులు కాలినడకన తీసుకువచ్చి పంపించడం లేదా పిల్లలే నేరుగా వస్తుంటారు. నగరంలో చాలావరకు పాఠశాలలు ప్రధాన రహదారులు లేదా కాలనీ రహదారుల పక్కనే ఉన్నాయి. ఆయా రోడ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రద్దీలో విద్యార్థులు రోడ్డు  దాటుకుని వెళ్లేందుకు నానాయాతన పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.  ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, చైతన్యపురి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, లింగంపల్లి, చందానగర్‌, నాచారం, ఖైరతాబాద్‌ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.  స్కూల్‌ బస్సులు సైతం రోడ్డుకు అవతల నిలుపుతున్నారు. కనీసం బస్సులు ఎక్కేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి.
సూచికలుండవు..క్రాసింగ్‌లు కనిపించవు
ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాఠశాలల వద్ద కనీస ఏర్పాట్లు కరవయ్యాయి. ఇటీవల మూడు ప్రాంతాల్లో పోలీసు శాఖ తరఫున స్కూల్‌ జోన్లు ఏర్పాటు చేశారు. జోన్లు ఏర్పాటు చేసి సరిపెడుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. అబిడ్స్‌లో స్కూల్‌ జోన్‌ ఏర్పాటు చేసినా.. ట్రాఫిక్‌ నరకంగా మారింది. పాఠశాలలు ఉన్న చోట ప్రత్యేకంగా సూచికలు లేకపోవడంతో వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్ని బడుల వద్ద కనీసం జీబ్రా క్రాసింగులూ లేవు. వీటిని ఏర్పాటు చేసే విషయాన్ని బల్దియా సైతం పట్టించుకోవడంలేదు. పాఠశాల యాజమాన్యాలు బయట తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులను దించి, తీసుకెళ్లేందుకు స్కూల్‌ బస్‌లు, వ్యాన్లు, ఆటోలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో రహదారుల పక్కనే నిలుపుతున్నారు. వాటిని చేరుకునేందుకు రోడ్లపైనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల ఎక్కడపడితే అక్కడ రహదారులు దాటుతూ.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.