• facebook
  • whatsapp
  • telegram

AP Schools: ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన

పూర్వప్రాథమిక విద్య నుంచే ప్రారంభం
రెండో తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు, 3-10 తరగతులకు ప్రొజెక్టర్లు
పాఠశాల విద్యా శాఖ సమీక్షలో సీఎం జగన్‌
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్‌ బోధన జరగాలని, పూర్వప్రాథమిక విద్య-1 నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. విద్యార్థులకు సబ్జెక్టులు అర్థమయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే(స్మార్ట్‌ టీవీ), ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాలని, స్మార్ట్‌ బోధనతో ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యపై జులై 22న నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ‘పూర్వ ప్రాథమిక విద్య-1 నుంచి రెండో తరగతి వరకు ఇంటరాక్టివ్‌ టీవీలు, మూడో తరగతి ఆపైన ప్రొజెక్టర్లు పెట్టాలి. తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే టీవీలు నాణ్యతతో ఉండాలి. వీటిని అన్ని ఉన్నత పాఠశాలలు, ‘నాడు-నేడు’ మొదటి దశ పూర్తయిన బడుల్లో ఏర్పాటు చేయాలి. వచ్చేవారం దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలి. సెప్టెంబరులో ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాబ్‌ల్లోకి కంటెంట్‌ను బైజూస్‌ లోడ్‌ చేస్తుంది. పాఠశాలల్లో విలువైన ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నందున భద్రతకు చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచించాలి. పాఠశాల మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలి’ అని సూచించారు. ‘విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఎస్‌ఈఆర్‌టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలి. ‘నాడు-నేడు’ రెండో దశలో వసతిగృహాల్లో పనులు చేపట్టాలి. వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’ అని ఆదేశించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన ఉపకరణాలను సీఎం పరిశీలించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.