టాప్-10లో స్థానాలు దక్కించుకున్న విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాలి. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదవాలి.. ఏపీ ఎంసెట్ (ఈఏపీసెట్)లో విజేతలుగా నిలిచిన మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం ఇది. మంగళవారం విడుదలైన ఈ ఏపీఎంసెట్‌లో నగర విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో టాప్-10లో నిలిచారు. వారి అభిప్రాయాలిలా..
బాంబే ఐఐటీలో చదవాలనుంది: గంజి శ్రీనాథ్, ఇంజినీరింగ్ 5వ ర్యాంకు, అమీర్‌పేట
ఏపీ ఎంసెట్‌లో 5వ ర్యాంకు ఆనందంగా ఉంది. జేఈఈ మెయిన్‌లో 99.97 పర్సంటైల్ సాధించా. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఇందులో ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. రసాయనశాస్త్రం అంటే బాగా ఆసక్తి.
ప్రపంచ ప్రసిద్ధి వర్సిటీలో పీజీ: జాస్తి వీవీఎస్ యశ్వంత్, ఇంజినీరింగ్ 6వ ర్యాంకు, కావూరిహిల్స్
ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నా. మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించా. తర్వాత ఐఐటీ బాంబేలో చేరి కంప్యూటర్‌సైన్స్ చదవాలనుంది. తర్వాత ప్రసిద్ధి చెందిన ఏదో ఒక వర్సిటీ నుంచి మాస్టర్స్ చేయాలనుంది.
రోజుకు 12 గంటలు: ఇమ్మిడిశెట్టి నందన్ మంజునాథ్, ఇంజినీరింగ్ 9వ ర్యాంకు, కూకట్పల్లి
నిత్యం 12 గంటలు సాధన చేస్తున్నా. ప్రతి సబ్జెక్టుకు సమయాన్ని కేటాయించుకుని చదువుతున్నా. జేఈఈ మెయిన్‌లో 99.98 పర్సంటైల్ సాధించా. ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా. ఇందులో ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చదవాలనుకుంటున్నా.
ఎయిమ్స్ లేదా జిప్మర్లో చదువుతా: ఎస్.సాయివిఘ్నేశ్రెడ్డి, అగ్రికల్చర్-ఫార్మసీ 8వ ర్యాంకు, మాతృశ్రీనగర్
చిన్నప్పట్నుంచి మెడికల్ విభాగంవైపు వెళ్లాలనుకుని లక్ష్యంగా పెట్టుకున్నా. ఎంసెట్‌లో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నీట్ రాశాను.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. అందులో ర్యాంకు ఆధారంగా ఎయిమ్స్ లేదా జిప్మర్ చదవాలనుకుంటున్నా.
అడ్వాన్స్డ్ ర్యాంకు కోసం కష్టపడుతున్నా: బి.శివనాగ వెంకట ఆదిత్య, ఇంజినీరింగ్ 7వ ర్యాంకు, మాదాపూర్
ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్ 99.98 పర్సంటైల్ వచ్చింది. అడ్వాన్స్డ్ ర్యాంకు కోసం కష్టపడుతున్నా. ఇందుకోసం రోజంతా ప్రిపేర్ అవుతున్నా. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ కంప్యూటర్‌సైన్స్ చదవాలనుకుంటున్నా.
కార్డియాలజిస్టుగా సేవలందిస్తా: సాత్విక్‌రెడ్డి, 9వ ర్యాంకు, అమీన్పూర్
అమీన్పూర్: అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో కార్డియాలజిస్టుగా పేదలకు సేవలందిస్తా. నీట్ ఫలితాల్లో జాతీయస్థాయి మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా.
విజయవాడ విద్య, న్యూస్‌టుడే: ఈఏపీసెట్-2022 ఫలితాల్లో విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. టాప్-10లోపు ర్యాంకులు సాధించి సత్తాచాటారు. ఇందుకు దోహదపడిన అంశాలేంటో వారి మాటల్లో..
పరిశోధనా రంగంపై గురి: టి.ఉమేష్ కార్తికేయ(ఇంజినీరింగ్‌లో 4వ ర్యాంకు), పార్వతీపురం జిల్లా
బలిజిపేట మండలం గంగాడకు చెందిన ఉమేష్ కార్తికేయ ఇంటర్లో 977 మార్కులు తెచ్చుకున్నాడు. విజయవాడలోని శ్రీచైతన్యలో ఎంసెట్‌కు శిక్షణ తీసుకున్నాడు. అతడికి జేఈఈ మెయిన్స్‌లో 99.956 పర్సంటైల్ వచ్చింది. సబ్జ్జెక్టుల్లో అనుమానాలు నివృత్తి చేసుకోవడం, అధ్యాపకులు చెప్పిన వాటిని క్షుణ్ణంగా సాధనం చేయడం వల్ల 4వ ర్యాంకు వచ్చిందని ఉమేష్ కార్తికేయ పేర్కొన్నాడు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్స్ సైన్స్ చదివి పరిశోధనా రంగంలో రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు.
రోజూ ఆరు గంటలకు పైగా సాధన: ఎన్.రితిక్(ఇంజినీరింగ్‌లో 10వ ర్యాంకు), గుంటూరు జిల్లా
మంగళగిరికి చెందిన రితక్కు ఇంటర్లో 963 మార్కులు, జేఈఈ మెయిన్స్‌లో 99.97 పర్సంటైల్ సాధించాడు. అడ్వాన్సుడుకు ప్రిపేర్ అవుతున్నాడు. సబ్జెక్టుకు 6 గంటలు కేటాయించి కష్టపడి చదవడం, పాత మోడల్ పేపర్లు సాధన చేయటం వల్ల 10వ ర్యాంకు సాధ్యమయ్యిందని రితిక్ తెలిపాడు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్సు సైన్స్ సీటు సాధించటమే లక్ష్యమని వివరించాడు.
న్యూరో సర్జన్ అవుతా..: జి.తత్వమయూఖ్య(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వ ర్యాంకు), కడప జిల్లా
తత్వమయూఖ్య ఇంటర్లో 980 మార్కులు సాధించింది. నీట్ ప్రవేశపరీక్ష రాసింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదవడం ప్రారంభించింది. విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తి చేసింది. నిరంతరం పాఠ్యాంశాలు సాధన చేయడం వల్ల అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వ ర్యాంకు సాధ్యమయ్యిందని ఆమె తెలిపింది. మంచి మెడికల్ కళాశాలలో సీటు సాధించి న్యూరో సర్జన్ అయి పేదలకు సేవ చేస్తానని పేర్కొంది.
కార్డియాలజిస్టు కావడంపై దృష్టి: కె.స్టాన్లీప్రణీత్(అగ్రికల్చర్, ఫార్మసీలో 10వ ర్యాంకు), పశ్చిమగోదావరి జిల్లా
భీమవరానికి చెందిన స్లాన్లీప్రణీత్ ఇంటర్లో 979 మార్కులు సాధించాడు. నీట్ ప్రవేశపరీక్ష బాగా రాశాడు. ఎయిమ్స్‌లో కానీ, పాండిచ్చేరిలో కానీ మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యాడు. ఇష్టపడి చదవడం వల్ల అగ్రికల్చర్, ఫార్మసీలో 10వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. కార్డియాలజిస్టుగా పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.