ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి జులై 31 తుది గడువని ఉపాధి, శిక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎస్వీకే నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు www.iti.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. పదో తరగతి పాస్/ఫెయిల్ లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు.
గ్రూపు-1 అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ
గ్రూపు-1 పరీక్షలు రాయనున్న వెయ్యిమంది అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు కె.అశోక్‌కుమార్ తెలిపారు. దీన్ని వచ్చే నెల అయిదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఆదాయం రూ.అయిదు లక్షల కంటే తక్కువ ఉన్న వారు tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో జులై 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు, రేపు ఐసెట్-2022
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్ఐసెట్-2022ను జులై 27, 28ల్లో నిర్వహిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి జులై 26న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష జరుగుతుందని, 75,958 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ఎడ్‌సెట్‌కు 31,578 మంది హాజరు
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి జులై 26న నిర్వహించిన ఎడ్‌సెట్‌కు 31,578 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ ఆచార్య ఏ.రామకృష్ణ తెలిపారు. మొత్తం 38,091 మంది దరఖాస్తు చేయగా వారిలో 83 శాతం మంది పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు.
వెబ్సైట్లో ఎంసెట్ అగ్రికల్చర్ హాల్‌టికెట్లు
ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష కొత్త హాల్‌టికెట్లను అధికారులు మంగళవారం వెబ్సైట్లో పొందుపరిచారు. జులై 30, 31వ తేదీల్లో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
‘దోస్త్’ వెబ్ ఆప్షన్లకు 30 తుది గడువు
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశించేందుకు జులై 26వ తేదీ వరకు మొత్తం 1.10 లక్షల మంది రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో దరఖాస్తు సమర్పించింది మాత్రం 83,611 మందే. వెబ్ ఆప్షన్లను కేవలం 68,178 మందే ఇచ్చుకున్నారు. అంటే 42,156 మంది ఏ కోర్సులో, ఏ సబ్జెక్టులను ఎంచుకోవాలో ఐచ్ఛికాలు నమోదు చేసుకోలేదు. జులై 30వ తేదీ వరకు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.