• facebook
  • whatsapp
  • telegram

AP Govt Schools: పాఠశాలకు డుమ్మా?

* ఆందోళనకరంగా విద్యార్థుల గైర్హాజరు

* ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 15%-19%,  ప్రైవేటులో 8%-10% మంది డుమ్మా

 

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో రోజువారీ విద్యార్థుల గైర్హాజరు ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ బడులకు వచ్చే వారిలో సరాసరిన 15 నుంచి 19 శాతంగా... అదే ప్రైవేటులో ఇది 8 నుంచి 10శాతంగా ఉంటోంది. మొత్తంగా చూస్తే సగటున 13 శాతం నుంచి 15 శాతం వరకు విద్యార్థులు తరగతులకు రావడం లేదు. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం శనివారం ప్రభుత్వ బడుల్లో సరాసరిన 19 శాతం, ప్రైవేటులో 10 శాతం మంది విద్యార్థులు బడి మానేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59,193 పాఠశాలలు ఉన్నాయి. శనివారం 54,396 పాఠశాలల్లో హాజరు నమోదైంది. ఈ పాఠశాలల్లో మొత్తం 63,34,174 మంది విద్యార్థులు ఉండగా... వారిలో 53,68,535 మంది హాజరయ్యారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు, సీజనల్‌ వ్యాధుల వల్ల వారు రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుత వర్షాల సీజన్‌లో వ్యవసాయ పనుల నిమిత్తం కొందరు తమ తల్లిదండ్రుల వెంట వెళ్లడం ప్రధానం కారణంగా కనపడుతోంది.

* కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు(పీఏబీ) నివేదిక ప్రకారం ఏడాదిలో సరాసరిన బడి మానేస్తున్న వారు పదోతరగతిలో 31.3 శాతంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.80 లక్షల మంది చదువు మధ్యలోనే మానేస్తున్నట్లు వెల్లడించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు పంపాలన్న ఆదేశాలు బుట్టదాఖలు

ఇలా... తరగతులకు హాజరుకాకపోవడంతో సహజంగా విద్యార్థులు అభ్యసనలో వెనకబడతారు. ఆ తర్వాత మధ్యలో బడి మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి వారు రాకపోతే తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాలి. వరుసగా రెండు, మూడు రోజులు మానేస్తే వాలంటీరు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలి. ఈ మేరకు విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. 20శాతం కంటే ఎక్కువ మంది గైర్హాజరైతే ప్రధానోపాధ్యాయుడిని వివరణ అడుగుతున్నారు. అక్కడితో అది అయిపోతోంది. వాస్తవంగా విద్యార్థులు ఎందుకు రావడం లేదన్న కారణాలను తెలుసుకోవడం లేదు. ఈ సమాచారం తెలుసుకుంటే గైర్హాజరును చాలా వరకూ అరికట్టవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

ఏడాదిలో 15రోజులైనా తీవ్రమే

ఒక విద్యా సంవత్సరంలో 10శాతం పాఠశాలల పనిదినాలు లేదా 15 రోజులు ఒక విద్యార్థి బడికి రాకపోతే దానిని దీర్ఘకాలిక గైర్హాజరుగా పరిగణించాల్సి ఉంటుంది. దీని కారణంగా వారు అభ్యసనంలో వెనకపడిపోతారు. పాఠాలు సరిగా అర్థం కావు. ఫిన్లాండ్‌ లాంటి దేశాల్లో విద్యార్థుల గైర్హాజరు 2.8శాతం మాత్రమే ఉంటోంది. మన దగ్గర 10శాతం బడిమానేసినా పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. ఆ తర్వాత పాఠశాలలకు వచ్చినా అలాంటి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.