* దేశవ్యాప్తంగా 24 మందికి 100 పర్సంటైల్
* ర్యాంకుల్లో 12 మంది మనోళ్లే
ఈనాడు, హైదరాబాద్, అమరావతి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. దేశవ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో 24 మంది 100 పర్సంటైల్ సాధించగా.. అందులో అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అయిదుగురు చొప్పున 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి నలుగురు, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు. మిగతా 8 మంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఉండడం గమనార్హం. జేఈఈ మెయిన్ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) ఆగస్టు 7న తెల్లవారుజామున ఫలితాలు ప్రకటించింది. ర్యాంకులను వెబ్సైట్లో వెల్లడించలేదు. విద్యార్థులకు మాత్రమే పంపింది. దీనిప్రకారం తెలంగాణకు చెందిన ధీరజ్ కురుకుండ నాలుగో ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పెనికలపాటి రవికిశోర్ 6, హిమవంశీ 7, అనికేత్ ఛటోపాధ్యాయ 8, పల్లి జలజాక్షి 9 ర్యాంకులు సాధించారు. కర్ణాటకలో ఇంటర్ చదివిన హిందూపురం విద్యార్థి బోయ హరేన్ సాత్విక్ 10వ ర్యాంకు సాధించాడు. మొత్తంగా తొలి 10 ర్యాంకుల్లో ఆరు, 25లో 12 ర్యాంకుల్ని మన వారే కైవసం చేసుకున్నారు. మెయిన్‌లో కటాఫ్ స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు సమర్పణ ప్రక్రియ ఆగస్టు 8న రాత్రి 8 గంటల నుంచి ప్రారంభించినట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఆగస్టు 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా అగ్రగణ్యులు
బాలికలు: పల్లి జలజాక్షి (ఏపీ), చందా మౌమిత (తెలంగాణ)
జనరల్ ఈడబ్ల్యూఎస్: పొలిశెట్టి కార్తికేయ (ఏపీ), భోగి సిరి (ఏపీ)
ఓబీసీ: పల్లి జలజాక్షి, హిమవంశీ, కొయ్యన సుహాస్.. ఈ ముగ్గురూ ఏపీ వారే.
ఎస్సీ: దయ్యాల జాన్ జోసెఫ్ (ఏపీ), నూతక్కి రిత్విక్ (ఏపీ), కాకర జశ్వంత్ (తెలంగాణ)
ఎస్టీ: చరణ్సింగ్నాయక్ (ఏపీ), మాలోత్ విశాల్నాయక్ (తెలంగాణ)
దివ్యాంగులు: గైకోటి విఘ్నేష్ (తెలంగాణ), మందల రాహుల్ (తెలంగాణ)
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా
జేఈఈ మెయిన్‌లో 100 పర్సంటైల్ రావడంతో ఉత్తమ ర్యాంకు దక్కుతుందని ఊహించా. నా దృష్టంతా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకుపైనే. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతా. మా సొంతూరు కర్నూలు జిల్లా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాం. నా చదువు కోసం ఇక్కడే స్థిరపడ్డాం. అమ్మ గృహిణి. - ధీరజ్ కురుకుండ, 4వ ర్యాంక్, హైదరాబాద్
ఐఏఎస్ కావడమే లక్ష్యం
మాది హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదళ్ల. ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. తల్లిదండ్రులు గైకోటి రవి, రజిత విఘ్నేష్. మాది వ్యవసాయాధారిత కుటుంబం. - గైకోటి విఘ్నేష్, దివ్యాంగుల కోటాలో తెలంగాణ టాపర్
సత్తాచాటిన గిరిజన విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: ‘‘గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి జేఈఈ మెయిన్‌లో 20 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ కన్నా ఎక్కువ వచ్చింది. సొసైటీ నుంచి 542 మంది పరీక్ష రాయగా, 467 మంది అర్హత సాధించారు. గిరిజన, ఏకలవ్య సొసైటీ నుంచి ఈ ఏడాదికి కనీసం 150 మందికిపైగా విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశముంది’’ అని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తెలిపారు.
* జేఈఈ మెయిన్‌లో బీసీ గురుకులాలకు చెందిన 20 మంది విద్యార్థులు అర్హత సాధించారని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు.
రోజూ 12 గంటలు కృషి
రోజూ 12 గంటలు చదివా. ఆరో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. మాది గుంటూరు. తండ్రి ఆదినారాయణ లైబ్రేరియన్. తల్లి నందకుమారి స్టాప్‌నర్సు. - పి.రవికిశోర్, 6వ ర్యాంకు
పట్టుదలతో చదివా
జేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివా. మాది శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, తల్లి స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ఉపాధ్యాయులే. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని ఉంది. - ఎం.హిమవంశీ, ఓపెన్ కేటగిరిలో 7, ఓబీసీలో మొదటి ర్యాంక్
సివిల్స్‌పై గురి
మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకారపల్లి గ్రామం. నాన్న గోవిందరావు ఉపాధ్యాయుడు, తల్లి జయలక్ష్మి గృహిణి. ఐఐటీ ముంబయిలో బీటెక్ చదివి, సివిల్స్ చేయాలనేది లక్ష్యం. - పి.జలజాక్షి, 9వ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా
జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నా
మాది శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం. అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు సాధించి దేశంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కళాశాలలో ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదువుతా. - హరేన్ సాత్విక్, 10వ ర్యాంక్, కర్ణాటక (సొంతూరు హిందూపురం)
******************************************************************************
జేఈఈ అడ్వాన్స్డ్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇలా మొదలు పెట్టండి ఇంజినీరింగ్!
‣ అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.