• facebook
  • whatsapp
  • telegram

TA EAMCET Results: టాపర్లలో అబ్బాయిలు.. ఉత్తీర్ణతలో అమ్మాయిలు

* ఇంజినీరింగ్‌లో 80.41%, అగ్రికల్చర్‌లో 88.34% ఉత్తీర్ణత

* గత ఏడాది కంటే తగ్గుదల

* తొలి 10 ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులదే హవా

* తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల విడుదల

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ఎనిమిది మంది, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో ఏడుగురూ వారే. టాపర్లలో ఒక్కో విభాగంలో ఏడుగురు ఏపీ విద్యార్థులే కావడం విశేషం. ఎంసెట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ‌స్టు 12న‌ జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. నిరుడు ఇంజినీరింగ్‌లో 82.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 80.41 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో గత ఏడాది 92.48 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 88.34 శాతానికి పడిపోయింది. మొత్తం 160 మార్కుల్లో 40 వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. టాపర్లలో అబ్బాయిలు సత్తా చాటినా.. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే పైచేయి. రెండు విభాగాల్లోనూ వారే మూడు శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్‌, వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఎంసెట్‌ ర్యాంకర్ల మనోగతాలు

 

   

అన్నయ్యే స్ఫూర్తి

మా సొంతూరు ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు. నాన్న మాల్యాద్రిరెడ్డి, అమ్మ లక్ష్మీకాంతం. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు మా అన్నయ్య లోకేశ్‌రెడ్డి స్ఫూర్తి. ఆయన గతేడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌లో 23వ ర్యాంకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 5వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ముంబయి ఐఐటీలో చదువుతున్నారు. నేను జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌కు ఒకే తరహాలో సన్నద్ధమయ్యాను. గణితానికి నిత్యం రెండు గంటలు, ఫిజిక్స్‌కు 3 గంటలు, కెమిస్ట్రీకి 4 గంటల సమయం కేటాయించాను. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుంది.  -పి.లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి, ఇంజినీరింగ్‌లో ప్రథమ ర్యాంకు

 

ఐఐటీలో సీఎస్‌ఈయే లక్ష్యం

మా సొంతూరు విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని ఖండ్యాం గ్రామం. నాన్న జయరాం కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, తల్లి జ్యోతి గృహిణి. ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో 99.92 శాతం మార్కులతో 120వ ర్యాంకు పొందాను. తాజాగా తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంకు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు సాధించి సీఎస్‌ఈ చదవాలన్నది నా లక్ష్యం.    -నక్క సాయిదీప్తిక, ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకు

 

స్టార్టప్‌ కంపెనీ పెడతా

మా అమ్మానాన్నలు కోటేశ్వరరావు, కోటేశ్వరిల పోత్సాహం బాగా ఉంది. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి స్టార్టప్‌ కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం. నేనొక్కడ్నే ఉద్యోగం చేయటం కాదు.. పదిమందికి ఉపాధి చూపటమే ధ్యేయం. జేఈఈ మెయిన్‌ ఓపెన్‌ కేటగిరిలో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు కాగా.. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మొదటి ర్యాంకు వచ్చింది. సగటున రోజుకు 14 గంటలు చదివేవాణ్ని.   -పోలిశెట్టి కార్తికేయ, ఇంజినీరింగ్‌లో మూడో ర్యాంకు

 

న్యూరాలజిస్టునవుతా

తెలంగాణ ఎంసెట్‌లో అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలవటం ఎంతో ఆనందాన్నిచ్చింది. గొప్ప న్యూరాలజిస్టును అవ్వాలనేది లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. నీట్‌లోనూ మంచి స్కోర్‌ సాధిస్తానని నమ్మకం ఉంది. రోజుకు సగటున 14 గంటలు చదివేదాన్ని. కళాశాలలో అధ్యాపకుల మార్గదర్శనం, పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేశాను. అకాడమీ పుస్తకాలతో పాటు జాతీయ పాఠ్యపుస్తకాలు చదివాను. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏపీ, తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించగలిగా.   -జూటూరి నేహ, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకు

 

వైద్యవిద్య అభ్యసించాలని...

మాది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పొడుగుపాలెం. ప్రస్తుతం విజయనగరం జిల్లా కొత్తవలసలో ఉంటున్నాం. తండ్రి గౌరినాయుడు వ్యవసాయదారుడు. తల్లి దేముడమ్మ గృహిణి. ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో 88వ ర్యాంకు పొందాను. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యను అభ్యసించాలన్నది నా లక్ష్యం.   -వంటాకు రోహిత్‌, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో రెండో ర్యాంకు

 

ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే..
డాక్టర్ని అవ్వాలనేది కల. ఎంసెట్‌, నీట్‌ పరీక్షలకు రోజుకు సగటున 18 గంటలు చదివేవాడిని. అమ్మానాన్నలు కె.శివనాగిరెడ్డి, కోటేశ్వరి అంతగా చదువుకోకపోయినా నా విషయంలో వెన్నంటి నిలిచారు. తాత అంజిరెడ్డి బాగా ప్రోత్సహించారు. పాఠ్యాంశాలను ఏరోజుకారోజు ప్రణాళికాబద్ధంగా చదవటం, గత పరీక్షల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయటంతోనే అత్యధిక మార్కులు సాధించగలిగాను. న్యూరాలజీ చదివి డాక్టర్‌గా స్థిరపడాలనుకుంటున్నా.  -కళ్లం తరుణ్‌కుమార్‌రెడ్డి, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో మూడో ర్యాంకు

 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.