• facebook
  • whatsapp
  • telegram

Accreditation Boards: అక్రిడిటేషన్‌ బోర్డులూ విలీనం!

* ఎన్‌బీఏ, న్యాక్‌ స్థానంలో ఇక ఒకటే సంస్థ

* ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో అక్రిడిటేషన్‌ను కలిపే యోచన

* అయిదుగురు నిపుణులతో కమిటీ


ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడిటేషన్‌ ఇచ్చేందుకు పనిచేస్తున్న బోర్డులను విలీనం చేసి కొత్తగా మరో సంస్థను నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌)లను విలీనం చేయనున్నారు. అంతేకాకుండా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో అక్రిడిటేషన్‌ను కూడా కలిపేయనున్నారని తెలుస్తోంది. అందుకు అవసరమైన సూచనలు చేసేందుకు అయిదుగురు నిపుణులతో కేంద్ర విద్యాశాఖ తాజాగా కమిటీని నియమించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. అక్రిడిటేషన్‌ విధానాన్ని బలోపేతం చేయాలని నూతన, ఇప్పుడున్న సంస్థలను విలీనం చేసి నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌)గా మార్చాలని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రిడిటేషన్‌ బోర్డులను విలీనం చేసేందుకు కసరత్తు మొదలైంది. యూజీసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ భూషణ్‌ పట్వర్ధన్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. హెచ్‌సీయూ ఉపకులపతి బీజే రావు, తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) ఆచార్యుడు కేఎన్‌ గణేష్‌, ఐఐటీ దిల్లీ మాజీ సంచాలకుడు సురేందర్‌ ప్రసాద్‌, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(రాంచీ) మాజీ సంచాలకుడు ఇంద్రానిల్‌ మన్న సభ్యులుగా ఉన్నారు. రెండు బోర్డులతో పాటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ను కూడా కలిపి అక్రిడిటేషన్‌, ర్యాంకుల్లో ఏదైనా ఒకటే ఉండేందుకు ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. కేంద్రం కొత్త ప్రతిపాదనపై హెచ్‌సీయూ సీనియర్‌ ఆచార్యుడు బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. వివిధ రకాల అక్రిడిటేషన్లు ఉండటం వల్ల అయోమయం నెలకొంటోంది...అంతేకాకుండా నివేదికలకు, తనిఖీల కోసం ఆచార్యులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని అన్నారు.

ప్రస్తుతమున్న బోర్డులివీ...

ఎన్‌బీఏ.. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ తదితర వాటిల్లో డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ కోర్సులకు అక్రిడిటేషన్‌ ఇస్తుంది. బ్రాంచీల వారీగా వీటిని కేటాయిస్తారు. న్యూదిల్లీ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. దీన్ని 1994లో ఏఐసీటీఈ ఏర్పాటు చేయగా 2010 నుంచి స్వయంప్రతిపత్తి సంస్థగా మారింది. ఈ సంస్థ అక్రిడిటేషన్‌ ఉన్న బీటెక్‌ కోర్సులకు రాష్ట్రంలో విద్యార్థుల నుంచి రూ.5 వేలు అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఆ కోర్సుల్లో అధ్యాపకులు, ల్యాబ్‌లు, చేరే విద్యార్థుల ర్యాంకులు, బీటెక్‌లో ఉత్తీర్ణత, సగటు మార్కుల శాతం, ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యకు వెళ్లే వారి శాతం తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ అక్రిడిటేషన్‌ జారీ చేస్తారు.
న్యాక్‌.. అన్ని రకాల ఉన్నత విద్య కోర్సులను అందించే కళాశాలలు, వర్సిటీలకు గ్రేడ్‌ ఇస్తుంది. 1994లో దీన్ని నెలకొల్పగా కేంద్ర కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది విద్యా సంస్థ మొత్తంలో ఉన్న మౌలిక సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్‌ జారీ చేస్తుంది. పొందిన పాయింట్లను బట్టి 2-5 సంవత్సరాలపాటు గ్రేడ్‌ కేటాయిస్తారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అనేక అవ‌కాశాలు అందిస్తుంది 'లా'!

‣ ఎంసెట్‌లో టాప్‌ర్యాంక్‌ ఎలా సాధ్యమైంది?

‣ ఐఐటీలో ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సు

‣ దిల్లీలో ఎస్‌ఐ ఉద్యోగాలు

‣ కానిస్టేబుల్‌ పరీక్షకు చివరి దశ ప్రిపరేషన్‌ ఎలా?

‣ వైద్య విద్యలో అత్యుత్తమం... ఎయిమ్స్‌

‣ దేశ రక్షణలో మీరూ భాగమవుతారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.