* అనుమతించిన సీట్లనే పరిగణనలోకి తీసుకోవాలి
* ఎన్ఎంసీ తాజా ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి 2022-23 సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. గడువు సమీపిస్తున్న ఈ పరిస్థితుల్లో... పీజీ వైద్య విద్య సీట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఇప్పటికీ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సీట్లను ఇచ్చే ఉద్దేశం ఉందన్నట్లుగా లేఖలు (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఇస్తోంది. ఇచ్చిన తర్వాత మరోసారి ఎన్ఎంసీ నిపుణుల బృందం ఆయా కళాశాలలను పరిశీలించి, అవసరమైన పూచీకత్తులను స్వీకరించి, సీట్లకు పూర్తిస్థాయిలో అనుమతులిస్తుంది. ప్రవేశ ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో ఇలా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం వల్ల ఆయా సీట్లను ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొంది. పైగా ఎన్ని సీట్లను కన్వీనర్ కోటా కింద లెక్కలోకి తీసుకుంటే.. అందులో సగం సీట్లను అఖిల భారత కోటాలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వాటినే రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసుకోవాలి. ఇంత సంక్లిష్టత నెలకొనడంతో తాజాగా డీజీహెచ్ఎస్ ఈ అంశంపై స్పష్టతనిస్తూ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. ప్రవేశ ప్రకటన వెలువరించడానికి ముందు ఎన్ని సీట్లకు అనుమతి లభిస్తుందో... ఆ సీట్లను మాత్రమే ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరించింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన సీట్లను ప్రవేశాల జాబితాలో పొందుపరచవద్దని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ అనుమతి ఉన్న పీజీ సీట్లకే ప్రవేశ ప్రకటన వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.
మలివిడత కౌన్సెలింగ్కు పరిగణనలోకి..
తెలంగాణ రాష్ట్రంలో 2070 పీజీ వైద్యవిద్య సీట్లుండగా రెండు వైద్య కళాశాలల నుంచి గతేడాది ప్రవేశాలు పొందిన 130 పీజీ సీట్లను రద్దు చేస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇంకా సర్దుబాటు చేయలేదు. 2022-23 సంవత్సరానికి ఎలాగూ వీటికి అనుమతి లభించదు. దీంతో ఆ మేరకు సీట్లను కోల్పోయినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 200కి పైగా పీజీ సీట్లు ఈ ఏడాది కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇంకా అనుమతి లేఖలు రాకపోవడంతో తొలివిడత ప్రవేశాలనాటికి వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశాల్లేవు. తగ్గిన సీట్లతోనే ఈసారి పీజీ వైద్యవిద్య ప్రవేశ ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ తొలివిడత ప్రవేశ ప్రకటన తర్వాత గనుక అనుమతి వస్తే అప్పుడు కొత్తగా వచ్చిన పీజీ సీట్లను తరువాత విడత కౌన్సెలింగ్లకు లెక్కలోకి తీసుకుంటామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన సీట్లకు అనుమతి ఇవ్వడానికి ముందు ఇంకా ఏమైనాలోపాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటే.. ఆయా కళాశాలల నుంచి పూచీకత్తు స్వీకరిస్తారని, ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇదే విషయంలో సర్కారు పూచీకత్తుగా వ్యవహరిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.