• facebook
  • whatsapp
  • telegram

TS Gvt Schools: పాత చొక్కాలు.. పుస్తకాలు

25-30 శాతం మంది విద్యార్థులకు అందని కొత్త పుస్తకాలు
యూనిఫామ్‌లు రాక పాత దుస్తులే గతి
నత్తనడకన ‘మన ఊరు-మన బడి’
పాఠశాలలు తెరిచి రెండున్నర  నెలలైనా విద్యాశాఖ నిర్లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారితో వరుసగా రెండు విద్యా సంవత్సరాలు.. ప్రధానంగా సర్కారు పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఈసారి ప్రత్యక్ష తరగతులు సకాలంలోనే మొదలయ్యాయి. చదువులిక గాడిన పడతాయని అందరూ అనుకుంటే.. విద్యాశాఖ కనీసం పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించకపోవడం లక్షల మంది పిల్లలకు శాపంగా మారింది. ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిన విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు-ఆంగ్లం; ఉర్దూ-ఆంగ్లం(ద్విభాష) పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నామని ఘనంగా ప్రకటించినా.. ఆ మేరకు పుస్తకాలను సరఫరా చేయనేలేదు. రాష్ట్రంలో పాఠశాలలను తెరిచి రెండున్నర నెలలు గడుస్తోంది. ఇప్పటికే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1 పరీక్షలు ముగిశాయి. వచ్చే నెల మొదటి వారంలో ఎఫ్‌ఏ-2 పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు పాఠశాలలను ‘ఈనాడు’ స్వయంగా పరిశీలించగా.. సెప్టెంబరు 26 నుంచి మొదలయ్యే దసరా సెలవుల నాటికైనా విద్యార్థులందరికీ పుస్తకాలు, ఏకరూప దుస్తులు(యూనిఫామ్‌లు) అందడం సందేహంగానే ఉంది. చాలామంది పిల్లల వద్ద పాత పుస్తకాలే ఉన్నాయి. ఏకరూప దుస్తులనూ ఇవ్వకపోవడంతో విద్యార్థులు పాత, చిరిగిన దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. మరోవైపు ‘మన ఊరు-మన బడి’ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి.
రవాణా ఛార్జీల భారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 31.24 లక్షల మందికి 1.70 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. నాలుగైదు రోజుల క్రితమే జిల్లాలకు పుస్తకాలను సరఫరా చేశారు. అక్కడి నుంచి మండలాలకు, ఆ తర్వాత పాఠశాలలకు అందించేసరికి దసరా సెలవులు వచ్చేస్తాయి. డీఈఓలకు, ఎంఈఓలకు విద్యాశాఖ రవాణా ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పుస్తకాలున్నా దోమకొండ, బీబీపేట తదితర మండలాల్లోని పాఠశాలలకు తీసుకెళ్లలేదు. నిరుటి వరకు పాత పుస్తకాలు ఇచ్చినా పెద్దగా సమస్య ఉండేది కాదు. ఈసారి విద్యార్థులు పెద్దఎత్తున ఆంగ్ల మాధ్యమంలో చేరటంతో రెండు భాషల్లో ముద్రించినవి లేక నష్టపోతున్నారు. తరగతులకు తగ్గట్లు అన్ని పుస్తకాలు అందినవారు 75 శాతంలోపే ఉన్నారు. మొత్తం మీద దాదాపు 8 లక్షల మందికి ఒకటి నుంచి మూడు కొత్త పుస్తకాలు అందలేదని అంచనా.
సగం మందికి ఒక్క జత అయినా రాలేదు..
ఆగస్టు ముగుస్తున్నా సగం మంది విద్యార్థులకు ఒక్క జత దుస్తులూ అందలేదు. రెండో జత ఎప్పటికి అందుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఇప్పటివరకు ఒక్క పాఠశాలకూ నిర్వహణ నిధులివ్వలేదు. గతంలో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలుండగా.. వాటిని రద్దు చేసి కెనరా బ్యాంకులో ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించడంతో కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం వాటా నిధులు రాలేదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రతి ఉన్నత పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉంది. గత మార్చిలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. ఆరు నెలలవుతున్నా ఒక్కచోటా పనులు పూర్తి కాలేదు. అధిక శాతం బడుల్లో విద్యుత్‌ పనులే మొదలయ్యాయి. దానివల్ల తరగతుల నిర్వహణకు అంతరాయం కలుగుతోంది. కొన్నిచోట్ల గదుల్ని ఖాళీ చేసి చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారమే 9,123 బడులకుగాను 4,843 చోట్ల పనులు(53.08 శాతం) మొదలయ్యాయి.
పలు పాఠశాలల్లో ఇదీ పరిస్థితి..
 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలున్నాయి. కొత్త పుస్తకాలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో పాతవి సర్దుబాటు చేశారు. 79 మంది ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు ద్విభాష బదులు గత ఏడాది ముద్రించినవి ఇచ్చారు. ఇదే జిల్లా బీబీపేట ఉన్నత పాఠశాలలో ఈసారి విద్యార్థుల సంఖ్య 450 నుంచి 716కు పెరిగింది. ఇక్కడ 80% మందికి కొత్త పుస్తకాలు అందాయని హెచ్‌ఎం తెలిపారు. గణితం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, హిందీకి ఒక్కో ఉపాధ్యాయుడు అవసరమని టీచర్లు తెలిపారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా కాన్ఫరెన్స్‌ హాలులో రెండుసెక్షన్ల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. 30 మంది పిల్లలు లేని దోమకొండ మండలం లింగంపల్లి, సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలల్లోనూ పుస్తకాలు పూర్తిగా ఇవ్వలేదు.
 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 264 మంది విద్యార్థులుండగా బాలికలకు మాత్రమే ఒక జత ఏకరూప దుస్తులు అందాయి. మన ఊరు-మన బడి కింద రూ.19.99 లక్షలు మంజూరైనా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇదే మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో 241 మంది విద్యార్థులుండగా 141 మంది బాలికలకు మాత్రమే యూనిఫామ్‌లు అందాయి. 6-8 తరగతుల విద్యార్థుల్లో 75 శాతం మందికి కొత్త పుస్తకాలు అందాయని ఉపాధ్యాయులు తెలిపారు. మిగిలిన వారికి పాత పుస్తకాలు ఇచ్చారు.
 సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం ఉన్నత పాఠశాలకు మన ఊరు-మన బడి కింద రూ.19 లక్షలు మంజూరు కాగా కొద్ది రోజులుగా ఎలక్ట్రికల్‌, ఫ్లోరింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఒకేషనల్‌ కోర్సు బోధించే పార్ట్‌-టైమ్‌ ఇన్‌స్ట్రక్టరే బోధిస్తున్నారు. కొండపాక మండలం దుద్దెడ ఉన్నత పాఠశాలకు మన ఊరు-మన బడికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటివరకు మొదలుకాలేదు. బాలుర శౌచాలయాలకు రూ.6 లక్షలు కేటాయించారు. ఆ పనులూ ప్రారంభం కాలేదు.
 కామారెడ్డి జిల్లాలో గత మార్చి నుంచి బిల్లుల బకాయిలు రాలేదంటూ మధ్యాహ్న భోజన కార్మికులు పది రోజులుగా వంట చేయడం లేదు. దీంతో పిల్లలు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవాల్సి వస్తోంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.