అధ్వానంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
విద్యార్థుల ఆదరణ ఉన్నా..సౌకర్యాలు కరవు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్‌టుడే, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, నేరేడ్మెట్, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, సైదాబాద్: ప్రయోగాలు చేసేందుకు ల్యాబ్‌లు ఉండవు.. చదువుకునేందుకు సరిపడా తరగతి గదులూ కొరతే. కూర్చునేందుకు బెంచీలూ కరవే.. ఉదయం ఇంటర్ తరగతులు నడిస్తే.. మధ్యాహ్నం డిగ్రీ తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి. ఉన్నత ప్రమాణాలతో సాగాల్సిన ఉన్నత విద్య పరిస్థితి దారుణంగా మారింది. వరండాలో.. చెట్ల కింద కూర్చుని చదువుకొనే దుర్భరస్థితిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పరిస్థితులపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. కళాశాలల్లో అధ్వాన పరిస్థితులు వెలుగు చూశాయి.
ఇంటర్ పూర్తి చేసుకుని ఎన్నో ఆశలతో డిగ్రీలో చేరితే.. అసౌకర్యాలే పలకరిస్తున్నాయి. ఏటా వందల మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరి మూడేళ్లు పూర్తి చేయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఓయూ పరిధిలో చేరుతున్న డిగ్రీ విద్యార్థుల్లో మూడో ఏడాది ఆరో సెమిస్టర్ చేరుకునే సరికి 45శాతం మంది తగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో బీకాం కోర్సులకు డిమాండ్ ఉంటోంది. ల్యాబ్‌లలో కంప్యూటర్లు ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బీఎస్సీ కోర్సులకు సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు వీల్లేక ఆ కోర్సుల జోలికే వెళ్లడం లేదు.
షిఫ్టు పద్ధతిలోనే తరగతులు
కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, చంచల్‌గూడ, సిటీ కాలేజీ, విద్యానగర్ సహా 12 చోట్ల షిఫ్టు పద్ధతిలోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం ఇంటర్, మధ్యాహ్నం డిగ్రీ తరగతులు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి డిగ్రీ కళాశాలలో 14 ఏళ్లుగా షిఫ్టు పద్ధతే. 2014లో రూ.2కోట్లతో కొత్త భవన నిర్మాణం ప్రారంభించగా.. ఎనిమిదేళ్లుగా పునాదులకే పరిమితమైంది. వందేళ్ల చరిత్ర ఉన్న సిటీ కళాశాలలోనూ ఇదే పరిస్థితి.
‣ ఈ చిన్న భవనాన్ని చూడండి.. ఇదేదో అంగన్వాడీనో.. 20 మంది చదువుకునే ప్రాథమిక పాఠశాలో కాదు. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో నడుస్తున్న శేరిలింగంపల్లి డిగ్రీ కళాశాల. 400 మంది విద్యార్థులున్నా.. సొంత భవనం లేక నానాయాతన పడుతున్నారు. ఈ భవనంతోపాటు పక్కనే ఉన్న జూనియర్ కళాశాలలో షిఫ్టు పద్ధతిలో డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. కనీసం మరుగుదొడ్డి లేక అధ్యాపకులు చందాలు వేసుకొని కట్టుకున్నారు. బీఎస్సీ కోర్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నా భవనం లేక పట్టించుకోవడం లేదు.
ఇదీ పరిస్థితి..
‣ చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరిపడా గదులు లేక వరండాలోనే కూర్చుంటున్నారు.
‣ కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది 1800 మంది విద్యార్థులున్నారు. ఒక తరగతి గదిలో 120మందితో బోధన సాగుతోంది. దీంతో విద్యార్థులు కింద కూర్చోవాల్సిన పరిస్థితి. అధ్యాపకులు కనీసం నిలబడి పాఠం చెప్పేందుకు వీలుండటం లేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కనీసం 40 నుంచి 50 గదులు అవసరం కాగా 15 మాత్రమే ఉన్నాయి.
‣ కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. వీటికి సొంత భవనాలు లేక స్థానికంగా ఉండే హైస్కూల్ లేదా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
‣ నేరేడ్మెట్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వరండా, చెట్ల కిందనే కూర్చుని విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులుండగా.. 1200మంది విద్యార్థులున్నారు. జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్‌నే డిగ్రీ కోర్సులకు వాడుకుంటున్నారు.
‣ ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. వసతులు పెరగడం లేదు. ప్రస్తుతం 24 తరగతి గదులుండగా.. మరో పది అవసరం ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.