• facebook
  • whatsapp
  • telegram

AP Teachers Attendance: 1 నుంచి యాప్‌ హాజరు తప్పనిసరి

ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు
ప్రభుత్వం స్పందించాలంటున్న టీచర్లు
లేకుంటే 2 నుంచి ‘యాప్‌ డౌన్‌’: ఫ్యాప్టో
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అటు ఉపాధ్యాయులు ఇటు విద్యాశాఖ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరిగా యాప్‌లో హాజరు వేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాశాఖలోని అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు అంతా ఇదే యాప్‌లో హాజరు వేయాలని, ఆగస్టు 31లోపు ఉపాధ్యాయులంతా యాప్‌లో నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఫ్యాప్టో.. ఉపాధ్యాయులెవరూ సొంత ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దంటూ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో ఆగస్టు 18న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల్లో ఆగస్టు 31 వరకు ప్రయోగాత్మకంగా హాజరు వేయాలని, తర్వాత సంఘాలతో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఆ గడువు బుధవారంతో ముగియనుండగా.. పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 1 నుంచి యాప్‌ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. మరోసారి సమావేశమవుదామని మంత్రి బొత్స హామీ ఇవ్వగా.. ఈలోపే విద్యాశాఖ యాప్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చేసిందని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటో తేదీలోపు స్పష్టత ఇవ్వకపోతే రెండో తేదీ నుంచి యాప్‌లను డౌన్‌ చేయాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది.
ఒక యాప్‌.. అనేక సమస్యలు..
రాష్ట్రంలో 1,85,090 మంది ఉపాధ్యాయులున్నారు. విద్యార్థుల హాజరు నమోదు సైతం యాప్‌లోనే పెట్టడంతో తప్పనిసరై 1,35,816 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఉదయం అందరూ ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్‌ సమస్య ఏర్పడుతోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్‌ కావడం లేదని చెబుతున్నారు. సొంత సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల సమాచారమంతా ప్రభుత్వానికి వెళ్లిపోతోందని, సీపీఎస్‌ ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు ఈ యాప్‌ ద్వారానే సమాచారం సేకరించారని ఆరోపిస్తున్నారు. హాజరు పడకపోతే జీతం కట్‌ చేస్తారని, దీన్ని సరిచేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వమే డివైజ్‌లు ఇస్తే అభ్యంతరం లేదని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ‘నాడు-నేడు’, మరుగుదొడ్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇవికాకుండా విద్యాకానుక, బెస్‌లైన్‌ పరీక్షలు, చైల్డ్‌ ఇన్ఫో వివరాలను ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ యాప్‌లను డౌన్‌ చేస్తే విద్యాశాఖకు సమాచారం నిలిచిపోతుంది.
ప్రభుత్వం డివైజ్‌లు ఇవ్వాలి: వెంకటేశ్వర్లు, ఛైర్మన్‌, ఫ్యాప్టో
‘ప్రభుత్వం డివైజ్‌లు ఇస్తే తప్పకుండా హాజరు నమోదు చేస్తాం. ముఖ ఆధారిత హాజరులో అనేక ఇబ్బందులున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. డివైజ్‌లు ఇచ్చే వరకు యాప్‌లో హాజరును స్వచ్ఛందం చేయాలి.’

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.