100లోపు స్థానాల్లో 25 మంది తెలుగువాళ్లే
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ బాంబే
ఈనాడు, హైదరాబాద్, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తొలి 10 ర్యాంకర్లలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందినవారే కావడం విశేషం. 2, 4, 6, 8, 10 ర్యాంకులను వరుసగా పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి, వంగపల్లి సాయి సిద్ధార్థ్, పోలిశెట్టి కార్తికేయ, కురుకుండ ధీరజ్, వెచ్చా జ్ఞానమహేశ్ సాధించారు. వీరిలో కార్తికేయ, జ్ఞానమహేశ్ ఏపీ నుంచి పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ తెలంగాణలో పరీక్ష రాశారు. అయితే వీరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. గత నెల 28వ తేదీన జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే ఆదివారం విడుదల చేసింది. ఐఐటీ బాంబే జోన్ నుంచి హాజరైన ఆర్.కె.శిశిర్ 360 మార్కులకు గాను 314 సాధించి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. 277 మార్కులు, 16వ ర్యాంకు సాధించిన ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన తనిష్కా కాబ్రా బాలికల్లో టాపర్‌గా నిలిచింది.
‣ ఈసారి అడ్వాన్స్‌డ్‌కు 1,60,038 మంది దరఖాస్తు చేసుకోగా 1,55,538 మంది రాశారు. వారిలో 1,21,930 మంది అబ్బాయిలు, 33,608 మంది అమ్మాయిలున్నారు.
‣ జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని కేటగిరీలు కలిపి 40,712 మంది అర్హత సాధించారు. వీరిలో 6,516 మంది అమ్మాయిలు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 15,111 మంది, ఓబీసీ-9,205 ఈడబ్ల్యూఎస్- 4979, ఎస్సీ- 7,984 ఎస్టీ- 3058 మందితో పాటు ప్రతి కేటగిరీలో దివ్యాంగ విభాగంలో మరికొంత మంది కౌన్సెలింగ్‌కు అర్హత పొందారు.
25 మంది వరకు మనవాళ్లే!
మొదటి 100 ర్యాంకర్లలో 25 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి 29 మంది మొదటి 100 స్థానాల్లో నిలవగా.. అందులో 25 మంది వరకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివి ర్యాంకులు సాధించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.