వికీపీడియా బలోపేతంలో ముందడుగు
ఫలిస్తున్న ట్రిపుల్ ఐటీ కృషి
ఈనాడు, హైదరాబాద్: తెలుగు వికీపీడియా బలోపేతం దిశగా హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) చేపట్టిన ఇండిక్ వికీ ప్రాజెక్టులో ముందడుగు పడింది. వర్సిటీకి చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో పది లక్షల తెలుగు వ్యాసాలను సిద్ధం చేశారు. వీటిని ప్రధాన వికీపీడియాలో నిక్షిప్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాంకేతికతను వినియోగించి వ్యాసాలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు సహా వివిధ భారతీయ భాషలలో అందుబాటులోకి రానున్నాయి.
ఏమిటీ ప్రాజెక్టు?
ఆంగ్ల వికీపీడియా 2001లో ప్రారంభం కాగా.. 2003లో తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లంలో 75 లక్షలకుపైగా వ్యాసాలు ఉంటే.. తెలుగులో సమాచారం ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో వికీపీడియాను వినియోగిస్తున్న వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ఐటీ పాలక మండలి అధ్యక్షుడు ప్రొ.రాజ్‌రెడ్డి సూచనల మేరకు వికీపీడియాలో తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మూడేళ్ల కిందట ట్రిపుల్ ఐటీ సంకల్పించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, వికీపీడియా ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. దీనికి వర్సిటీ ప్రొఫెసర్ వాసుదేవవర్మ ముఖ్య పరిశోధకులుగా ఉన్నారు.
తెలుగు, హిందీలలో
ఇండిక్వికీ ప్రాజెక్టులో భాగంగా తొలుత తెలుగు, హిందీ భాషల్లో వ్యాసాలను సిద్ధం చేస్తున్నారు. తెలుగు కోసం tewiki.iiit.ac.in, హిందీ కోసం hiwiki.iiit.ac.in పేరిట శాండ్బాక్సు (ట్రిపుల్ ఐటీ ప్రత్యేక బ్రౌజర్) లను తయారు చేశారు. తెలుగులో ఇప్పటివరకు పది లక్షల వ్యాసాలు పొందుపరిచారు. మరో 20 లక్షల వ్యాసాలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. హిందీలో 3 లక్షల వ్యాసాలు సిద్ధం చేయగా.. మరో 3 లక్షల వ్యాసాలు తీసుకురావాలనేది ప్రణాళిక. ప్రస్తుతం ఆయా వ్యాసాలన్నీ ట్రిపుల్ఐటీ రూపొందించిన శాండ్బాక్సులలోనే అందుబాటులో ఉంటాయి. మరిన్ని మెరుగులద్ది దశల వారీగా ఔత్సాహికులతో ప్రధాన వికీపీడియాలో అప్లోడ్ చేయించేందుకు కసరత్తు జరుగుతోంది.
కళాశాలల్లో వికీ క్లబ్‌ల ఏర్పాటు
ప్రాజెక్టులో భాగంగా విజ్ఞాన ఆధారిత వ్యాసాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో గ్రామాల, పట్టణాల సమాచారాన్ని పొందుపరిచారు. భవిష్యత్తులో యువతను ఎక్కువగా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో వికీ క్లబ్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు అయిదు క్లబ్‌లను ప్రారంభించగా.. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
12 భారతీయ భాషల్లో సిద్ధం చేస్తున్నాం: ప్రొ.వాసుదేవవర్మ, ముఖ్య పరిశోధకులు
ప్రస్తుతం మేం తయారు చేసిన ఇండిక్ వికీ ప్రాజెక్టులోని వ్యాసాలు ప్రధాన వికీపీడియాకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం వనరుగా మాత్రమే ఉపయోగపడతాయి. మేం తయారు చేసిన వ్యాసాలకు సవరణలు చేసి ప్రధాన వికీపీడియాలో అప్లోడ్ చేయవచ్చు. తెలుగు, హిందీతోపాటు 12 భారతీయ భాషలలో వ్యాసాల తయారీ ప్రక్రియ నడుస్తోంది. ఎన్ఎల్పీ సాంకేతికతతో దోషాలు లేకుండా వ్యాసాలు సిద్ధం చేశాం. మున్ముందు వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.