కళాశాలల అఫిడవిట్‌తో వైద్య సీట్ల పునరుద్ధరణకు ఎన్ఎంసీ ఉత్తర్వులు
తర్వాత ఆకస్మిక తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే సీట్ల రద్దే!
ఈనాడు, హైదరాబాద్: ఏ వైద్య కళాశాలలోనైనా సీట్లను పునరుద్ధరించాలంటే.. ముందుగా తనిఖీలు నిర్వహించి, లోపాలు లేకుంటే అనుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ విధానాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పక్కనపెట్టేసింది. దేశంలో గత 4-5 ఏళ్ల కాలంలో ఏర్పాటైన వైద్య కళాశాలల నుంచి అఫిడవిట్ తీసుకొని 2022-23 వైద్య విద్య సంవత్సరానికి సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రవేశాలు పూర్తయ్యాక.. కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నిర్ణయం వైద్యవిద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. తనిఖీలు చేపట్టకుండా అనుమతులు ఇవ్వడమెందుకు? తర్వాత లోపాలున్నాయంటూ సీట్లను రద్దు చేయడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రవేశాలు పూర్తయి తరగతులు కొనసాగుతున్న క్రమంలో సీట్లను రద్దు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‣ గత విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో అనుమతులిచ్చి, తర్వాత తనిఖీల్లో లోపాలు వెల్లడయ్యాయంటూ రాష్ట్రంలో మూడు వైద్య కళాశాలల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికీ ఆయా కళాశాలల్లోని వైద్య విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రెండు కళాశాలల విద్యార్థులను సర్దుబాటు చేసినా.. వాటిలోని యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు చిక్కులు ఎదురవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని వారంతా రోడ్డున పడాల్సి వచ్చింది. అయినా 2022-23 సంవత్సరానికి ఎన్ఎంసీ ఇదే నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నీట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మరో 3 వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు మొదలవనున్నాయి.
రాష్ట్రంలో 14 కళాశాలలపై ప్రభావం..
కొత్తగా ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే.. వరుసగా అయిదు సంవత్సరాల పాటు ఏటా అన్ని సీట్ల పునరుద్ధరణకు ఆ కళాశాల ఎన్ఎంసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇలా 4-5 ఏళ్ల లోపు ఏర్పాటైన కళాశాలలు 14 ఉన్నాయి. వీటిల్లో ఒకటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం కోర్సుల పునరుద్ధరణకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ జాబితాలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, సురభి, పట్నం మహేందర్‌రెడ్డి, అయాన్, మహావీర్, టీఆర్ఆర్, మహేశ్వర, మమత(బాచుపల్లి), ఆర్వీఎం కళాశాలలున్నాయి. మల్లారెడ్డికి చెందిన రెండు కళాశాలలు, ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో అదనపు సీట్ల పునరుద్ధరణకు అనుమతులు రావాలి. మొత్తంగా ఈ కళాశాలల్లో 2,250 ఎంబీబీఎస్ సీట్లను మొదటి ఏడాది భర్తీ చేస్తారు. ఈ క్రమంలో తనిఖీలు లేకుండా ప్రమాణ పత్రం ఆధారంగా సీట్లను పునరుద్ధరించడం ఆహ్వానించదగిన పరిణామం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.