వర్సిటీకి న్యాక్ గ్రేడ్ పెంచుకోవడమే లక్ష్యం
వ్యతిరేకిస్తున్న ఆచార్యులు
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్టీ)కి యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను ఎత్తివేయాలని ఆ విశ్వవిద్యాలయం భావిస్తోంది. దీనివల్ల ఆ కళాశాలలు వర్సిటీలో కలిసి, విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గ్రేడ్ పెరుగుతుందన్నది జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఆలోచన. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్కు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉండగా.. దాన్ని ‘ఏ-ప్లస్’కు తీసుకురావాలని యోచిస్తున్నారు. అటానమస్‌గా ఉన్న రెండు కళాశాలలు వర్సిటీలో భాగమైతేనే ‘ఏ-ప్లస్’ గ్రేడ్ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ఆచార్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కొందరు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఉన్నత విద్యాసంస్థలు స్వయంప్రతిపత్తిగా మారాలని యూజీసీ, నూతన జాతీయ విద్యావిధానం నిర్దేశిస్తుంటే.. ఇక్కడ అందుకు భిన్నంగా ఎందుకు వెళ్తున్నారని కొందరు సీనియర్ ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. స్వయంప్రతిపత్తి హోదా లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావన్నది మరో అభ్యంతరం. విశ్వవిద్యాలయం హోదా పెరిగితే దాని పరిధిలోని కళాశాలలకు కూడా మంచి పేరు వస్తుందని, వర్సిటీ కళాశాలలు అటానమస్‌గా మారితే వర్సిటీకి న్యాక్ గ్రేడ్ తగ్గి, ప్రతిష్ఠ దిగజారుతుందని వర్సిటీ డైరెక్టర్ ఒకరు చెప్పారు. ఆచార్యులు మాత్రం.. దీనిపై ఇతర వర్సిటీల అధికారులతో కమిటీ వేసి తుది నిర్ణయానికి రావాలని కోరుతున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్ఐటీ విలీనం
‣ వర్సిటీ ప్రాంగణంలో రెండు దశాబ్దాల క్రితం నెలకొల్పిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎస్ఐటీ)ని యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విలీనం చేస్తూ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐఎస్టీని, అందులోని కోర్సులను ఐటీ విభాగం పరిధిలో చేర్చారు.
‣ ప్రాంగణంలోని ఐఎస్టీని.. యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(యూపీజీసీఎస్టీ)గా పేరు మార్చారు. ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెస్సీ భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం కోర్సులు ఈ కొత్త కళాశాల పరిధిలోకే వస్తాయి.
‣ ఎంబీఏ కోర్సులకు ప్రత్యేక విభాగంగా ఉన్న స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(ఎస్ఎంఎస్)ను.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ (యూసీఎంహెచ్)గా పేరు మార్చారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అందరికీ అందని బ్యాంకింగ్ సేవలు
‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి
‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.