* లేకుంటే బీటెక్, బీఫార్మసీ ధ్రువపత్రాలు ఇవ్వం
* సీట్ల భర్తీకి కళాశాలల ఎత్తుగడ
ఈనాడు, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ సీట్లను భర్తీచేసుకునేందుకు పలు కళాశాలలు విద్యార్థులను పరోక్షంగా బెదిరిస్తున్నాయి. ఒరిజనల్ సర్టిఫికెట్లను తమ గుప్పిట్లో ఉంచుకొని విద్యార్థులను ఆటాడిస్తున్నాయి. ప్రభుత్వం.. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాల మధ్య బీటెక్, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులు నలిగిపోతున్నారు. బీటెక్, బీఫార్మసీ చివరి సంవత్సరం పూర్తయిన విద్యార్థులు తమ అసలు ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను అడుగుతుండగా, ప్రభుత్వం బోధన రుసుం ఇవ్వనందున ఆ మొత్తాన్ని మీరు చెల్లిస్తేనే అవి ఇస్తామంటూ వారు తెగేసి చెబుతున్నారు. లేని పక్షంలో తమ కళాశాలలోనే ఎంటెక్ లేదా ఎంఫార్మసీ కోర్సులో చేరాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారులోని పలు కళాశాలలకు చెందిన బీటెక్, బీఫార్మసీ విద్యార్థులు ఇటీవల పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ కార్యాలయానికి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
వెబ్ ఆప్షన్లు ఇచ్చేది కళాశాలలే
ఇప్పటివరకు సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు బకాయిలు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు షరతు పెట్టేవి. ఈసారి ఫీజులను ఇవ్వలేమంటే తమ కళాశాలలో ఎంటెక్/ ఎంఫార్మసీలో చేరాలంటూ కొత్త పంథా అవలంబిస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నాయి. అంగీకరిస్తే కళాశాల ప్రతినిధులే తమ కాలేజీలోని కోర్సులో మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇస్తున్నారు. ఇలా ఓ ఫార్మా కళాశాల ఓ విద్యార్థికి సంబంధించి ధ్రువపత్రాలను అప్లోడ్ చేసింది. పీజీఈసెట్ కన్వీనర్ కార్యాలయానికి అతను ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆప్షన్ల ప్రక్రియ అక్టోబర్ 7న మొదలైంది. కన్వీనర్ కోటా కింద 7 వేల సీట్లు ఉండగా.. అభ్యర్థులు 5,600 మందే ఉండటం గమనార్హం.
బోధన రుసుం కొంతైనా వసూలు చేయాలని..
ప్రభుత్వం నుంచి రెండేళ్ల బోధన రుసుముల బకాయిలు ఉన్నాయి. ఒక్కో కళాశాలకు రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు రావలసి ఉండగా.. కొంతైనా వసూలు చేసుకోవాలని యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. సొంతగా ఫీజు చెల్లిస్తే ధ్రువపత్రాలిస్తామని, సర్కారు నుంచి బోధన రుసుం విడుదలైతే తిరిగిస్తామని చెబుతున్నాయి. ఉద్యోగాలు వచ్చినవారు, ఇతర కళాశాలల్లో చదవాలనుకున్నవారు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లను తీసుకెళ్తున్నారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలను కళాశాలలు తీసుకోవడానికి వీల్లేదు. ‘ప్రభుత్వం చివరి ఏడాది చదువు పూర్తయిన వారికైనా బోధన రుసుముల బకాయిలు చెల్లిస్తే సమస్య ఉండదు’ అని ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.