ఉన్నత విద్యాసంస్థల్లో నవంబరు 2 నుంచి తరగతులు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ అక్టోబరు 17 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అన్ని తరగతులు నవంబరు 2నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని కార్యాలయంలో సోమవారం వైస్ ఛైర్మన్ రామమోహనరావు, కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 25 నుంచి 31 వరకు, పీజీఈసెట్ కౌన్సెలింగ్ 27 నుంచి నవంబరు 3వరకు జరుగుతుంది. లాసెట్‌కు సంబంధించి బార్ కౌన్సిల్ అనుమతులు రావాల్సి ఉంది. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నవంబరులో నిర్వహిస్తాం. పీజీసెట్ కౌన్సెలింగ్ ఈనెల 20 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాం. రీసెర్చ్ సెట్ పరీక్ష 17 నుంచి 19 వరకు నిర్వహించి, నవంబరులో ప్రవేశాలు కల్పిస్తాం. పీఈసెట్ ఈనెల 17 నుంచి 25 వరకు నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. బీఆర్క్ ప్రవేశాలు 17 నుంచి 22వరకు జరుగుతాయి. డిగ్రీ సీట్ల కేటాయింపు 14న పూర్తిచేసి, 17నుంచి తరగతులు ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు.
మొదటిసారిగా ఇంటర్న్‌షిప్
‘డిగ్రీ విద్యార్థులకు ఈ ఏడాది మొదటిసారిగా ఉచిత ఇంటర్న్‌షిప్ కల్పిస్తున్నాం. ఆన్లైన్లో 1.05లక్షలు, నేరుగా పరిశ్రమలు, సంస్థల్లో 1.07లక్షల మందికి ఇంటర్న్‌షిప్ ఇవ్వనున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి 3లక్షల మందికి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విద్యార్థులకు సౌకర్యంగా వర్క్‌బుక్‌లు తయారు చేసి కళాశాలలకు పంపించాం. ఏవైనా కంపెనీలు డబ్బులు తీసుకొని ఇంటర్న్‌షిప్ కల్పిస్తామంటే నమ్మొద్దు. ప్రస్తుతం రెండు నెలల సమయానికి ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. మూడో ఏడాదిలో ఆరు నెలలు ఇస్తాం’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.
పాలిటెక్నిక్ స్పాట్ ప్రవేశాలు 13న
పాలిటెక్నిక్‌లలో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 12 నుంచి స్పాట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కన్వీనర్ నాగరాణి తెలిపారు. సీట్ల ఖాళీలను 12న కళాశాలలు నోటీసు బోర్డులో ప్రదర్శిస్తాయని, 13న స్పాట్ ప్రవేశాలు కల్పిస్తాయని వెల్లడించారు. కన్వీనర్ కోటా తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 37,993 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం
‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?
‣ స్టడీమెటీరియల్.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!
‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.