* ఎంఎన్ఆర్ కాలేజీ విద్యార్థులకు హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: అనుమతుల వివాదం నేపథ్యంలో కొత్త కాలేజీల్లో సర్దుబాటు చేయాలన్న అభ్యర్థనకు సంబంధించి.. ఇరుపక్షాల వాదనలను విన్నాక నిర్ణయం వెలువరిస్తామని, అంతవరకు తరగతులకు హాజరు కావాలని ఎంఎన్ఆర్ వైద్య కళాశాల విద్యార్థులను అక్టోబరు 11న హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణ ముగిసేదాకా ఫీజుల చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దంటూ కాలేజీ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఎంఎన్ఆర్ కాలేజీలో మౌలిక వసతులు, అధ్యాపకులు లేరన్న కారణంగా అనుమతులు, అడ్మిషన్లను రద్దుచేసి.. కొత్త సీట్లను సృష్టించి బదిలీ చేసే సమయంలో తిరిగి ప్రవేశాలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ శశిధర్‌రెడ్డి మరో 17 మంది పీజీ మెడికల్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నగేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెండు నెలల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు నిర్వహించి సరైన మౌలిక వసతులు, అధ్యాపకులు లేరని అనుమతులు, అడ్మిషన్లు రద్దు చేసిందన్నారు. దీనిపై కేంద్రం ఆదేశాలతో తిరిగి పునరుద్ధరించిందన్నారు. ఎన్ఎంసీ అనుమతుల ఉత్తర్వులు జారీ చేసినంత త్వరగా మౌలిక వసతుల కల్పన సాధ్యం కాదన్నారు. కొత్త సీట్లు సృష్టించి తిరిగి పంపుతున్న సమయంలో ఎన్ఎంసీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చిందని, వసతుల్లేని కాలేజీల్లో చదవమని చెప్పడం ఎంతవరకు సబబని పేర్కొన్నారు. ఎన్ఎంసీ తరఫు న్యాయవాది జి.పూజిత వాదనలు వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. పాత అడ్మిషన్లను గుర్తించడంతోపాటు కొత్తవాటికి అనుమతించినట్లు చెప్పారు. ఎంఎన్ఆర్ కాలేజీ తరఫు న్యాయవాది శాలినీ స్రవంతి వాదనలు వినిపిస్తూ అన్ని వసతులు కల్పించాకే అనుమతులు వచ్చాయన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ నగలకు నగిషీలు చెక్కే నిపుణులు
‣ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్!
‣ అవుతారా.. టాబ్లూ డెవలపర్!
‣ ఇంజినీర్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.