ఉపాధ్యాయ కొలువుల కోసం డీఎస్‌సీ-1998 అభ్యర్థుల ఎదురుచూపులు
డీఎస్‌సీ-2008 అభ్యర్థులకూ ఉద్యోగాలివ్వాలని తాజాగా హైకోర్టు తీర్పు
సర్కారు నిర్ణయంపై ఆధారపడిన 3300 మంది భవిత
ఈనాడు, హైదరాబాద్: సుమారు రెండు దశాబ్దాలుగా వారు ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అన్యాయం జరిగిందని సర్కారు సైతం అంగీకరించినా.. న్యాయం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా వారికి ఎదురుతెన్నులు తప్పడం లేదు. డీఎస్‌సీ-1998 బాధితుల గోడు ఇది. 24ఏళ్లు అవుతున్నా వారికి ఉద్యోగాలు దక్కలేదు. బాధిత అభ్యర్థులు నిత్యం మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. తాజాగా డీఎస్‌సీ-2008 బాధితులకూ మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ కొలువులు ఇవ్వాలని హైకోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు డీఎస్‌సీలకు సంబంధించి కొలువులు ఇస్తే 3,300 మందికి ఊరట లభిస్తుందని బాధితులు చెబుతున్నారు.
డీఎస్‌సీ-1998 బాధితులను ఎంటీఎస్ విధానంలో తీసుకుంటారా?
ఉమ్మడి ఏపీలో 1998లో జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ)లో అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉన్నారని కటాఫ్ మార్కులు అయిదు తగ్గించి ముఖాముఖీలకు పిలిచారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అర్హత మార్కులు తగ్గించి ఇంటర్వ్యూలకు వచ్చిన వారికి అక్రమంగా ఎక్కువ మార్కులు ఇచ్చారన్నది ఆరోపణ. అప్పటి నుంచి అర్హులైన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూనే ఉన్నారు. ఈ క్రమంలో 2016 జనవరి 3న బాధిత అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మానవతా దృకృథంతో న్యాయం చేస్తానని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు వారికి ఉద్యోగాలు దక్కలేదు. ఏపీలో మినిమం టైమ్ స్కేల్(ఎంటీఎస్) విధానంలో కొలువుల్లోకి తీసుకున్నారని, అలాగే తమకూ న్యాయం చేయాలని ఇక్కడి బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుమారు 1500 మంది కొన్నేళ్లయినా సర్కారు కొలువులు చేస్తారు.
డీఎస్‌సీ-2008 బాధితులకైనా ఇస్తారా?
2008లో డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ అయ్యాక సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుల్లో 30 శాతం ఖాళీలను డీఈడీ అభ్యర్థులతో భర్తీచేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాంతో బీఈడీ అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తానికి 14 సంవత్సరాలుగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఖాళీగా ఉన్న 1,815 ఉపాధ్యాయ కొలువులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఇంకా తమకు తీర్పు కాపీ అందలేదని, అది వచ్చాక సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.