* ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: మౌలిక వసతులు లేవంటూ అడ్మిషన్లను రద్దు చేసిన మహావీర్ వైద్య కళాశాల పీజీ విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), రాష్ట్ర ప్రభుత్వాలను అక్టోబర్ 27న హైకోర్టు ఆదేశించింది. అనుమతులు రద్దు చేశాక తమను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ తేజస్వినితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్ 27న జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ఇతర కాలేజీ విద్యార్థులను సర్దుబాటు చేసినా మహావీర్ కాలేజీ విద్యార్థుల సర్దుబాటుకు ఎన్ఎంసీగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇంతవరకు సర్దుబాటు చేయకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుని విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఆ విద్యార్థినికి మెడిసిటీలో సీటివ్వండి
పీజీ మెడికల్ ప్రవేశాల్లో భర్తీకానీ సీటుకు నిర్వహించిన కౌన్సెలింగులో నిబంధనల ప్రకారం సాత్వికారెడ్డి అనే విద్యార్థినికి మెడిసిటీ కాలేజీలో సీటు ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఆ విద్యార్థిని 4వ ప్రాధాన్యంగా మెడిసిటీని, 5వ ప్రాధాన్యంగా ఎంఎన్ఆర్ కాలేజీని ఎంపిక చేసుకున్నారు. అయితే, అప్పటికే ఖమ్మం మమతా వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన మౌనిక కౌన్సెలింగులో పాల్గొనడంతో సాత్వికారెడ్డి సీటు మరో విద్యార్థినికి దక్కింది. మౌనిక మమతా కాలేజీలో అడ్మిషనును రద్దు చేసుకోకుండా కౌన్సెలింగులో పాల్గొనడంతో చర్యలు తీసుకున్నామని యూనివర్సిటీ చెబుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులను తప్పుబట్టిన హైకోర్టు.. పిటిషనర్ సాత్వికారెడ్డికి మెడిసిటీలో సీటు ఇవ్వాలని ఆదేశించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.