మార్పులు చేపట్టిన విద్యాశాఖ
ఈసారి 90 జీఎస్ఎం కాగితం వినియోగం
ముద్రణ టెండర్ల దాఖలుకు ముగిసిన గడువు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ పలు మార్పులు, చేర్పులు చేపట్టింది. పుస్తకాల్లోని కాగితాల మందంతో పాటు అక్షరాల పరిమాణాన్నీ పెంచాలని నిర్ణయించింది. పుస్తకాలు చూడగానే చదవాలన్న ఆసక్తి పిల్లల్లో రేకెత్తించడమే లక్ష్యమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. 1-10 తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణకు గత కొన్నేళ్లుగా 70 జీఎస్ఎం(గ్రామ్స్ పర్ స్క్వార్ మీటర్) కాగితాన్ని వినియోగిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) కోసం అదే మందం ఉన్న కాగితాన్ని వాడేందుకు మొదట టెండర్లు పిలిచారు. కానీ, 90 జీఎస్ఎం కాగితం వాడాలని నిర్ణయించి.. ఆ టెండర్లను 20 రోజుల క్రితం రద్దు చేశారు. మళ్లీ టెండర్లు పిలవగా బిడ్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. త్వరలో సాంకేతిక, ఆ తర్వాత ప్రైస్ బిడ్లను తెరవనున్నారు. కాగితాల మందం పెంచడం వల్ల త్వరగా చినిగిపోకుండా ఉంటాయని విద్యాశాఖ చెబుతోంది. పాఠ్యపుస్తకాల ముఖపత్రం(కవర్ పేజీ) మందాన్నీ పెంచనున్నారు. అందుకు 250 జీఎస్ఎం కాగితాన్ని వినియోగిస్తారు.
పెద్ద అక్షరాలు.. వెడల్పుగా పుస్తకాలు
1-3 తరగతుల పుస్తకాల్లోని అక్షరాల పరిమాణం(ఫాంట్ సైజ్) పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు పుస్తకాల వెడల్పు 7.5, పొడవు 10.9 అంగుళాలుండేది. వచ్చే విద్యాసంవత్సరానికి అందించే పుస్తకాల వెడల్పు 8.5 అంగుళాలుంటుంది. అంటే ఒక అంగుళం పెరగనుంది. పొడవులో మార్పుండదు. ఇప్పటివరకు అక్షరాల పరిమాణం 13 సైజు ఉండగా.. దాన్ని 15కు పెంచనున్నారు. అందుకే పుస్తకాల వెడల్పు పెంచుతున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పిల్లల్ని ఆకట్టుకునేందుకు పుస్తకాల్లో తీసుకురావాల్సిన మార్పులపై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్(టిస్), రూమ్ టు రీడ్ అనే సంస్థతో అధ్యయనం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. మందం, వెడల్పు పెంచడం వల్ల 9 వేల టన్నులకు బదులు 13 వేల టన్నుల వరకు కాగితం కొనుగోలు చేయాల్సి ఉంటుందని, దానివల్ల కనీసం రూ.50 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా.
వచ్చే ఏడాది 9వ తరగతి పుస్తకాలు రెండు భాషల్లో...
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1-8 తరగతుల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థులకు భాషాపరమైన సమస్య తలెత్తకుండా 2-8 తరగతుల పుస్తకాలను తెలుగు-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లంలో ముద్రించారు. ఒకవైపు తెలుగు లేదా ఉర్దూలో.. పక్క పేజీలో ఆంగ్లంలో పాఠాలు ఉంటాయి. వచ్చే ఏడాది 9వ తరగతికీ ఆంగ్ల మాధ్యమాన్ని విస్తరిస్తారు. పుస్తకాలను రెండు భాషల్లోనూ ముద్రిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.