పుస్తకాల బ్యాగు బరువు తగ్గించే భరోసా ఏదీ?
మోయలేక పిల్లల అవస్థలు
ఈనాడు, హైదరాబాద్: ఉదయాన్నే లేచి.. కిలోల కొద్దీ బరువున్న పుస్తకాలను మోయలేక మోస్తూ చిన్నారులు పాఠశాలలకు వెళుతుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో బడి సంచి బరువు తగ్గించాలని కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా.. పాఠశాలల నుంచి స్పందన తక్కువగానే ఉంటోంది. బ్యాగ్ ఫ్రీడే విధానాన్ని విద్యాసంస్థలు సీరియస్గా తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి ఒకటి నుంచి పదో తరగతి వరకు 19.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రాథమిక స్థాయిలో ప్రైవేటు పాఠశాలలన్నీ తమ సొంత సిలబస్ రూపొందించుకున్నాయి. ఎల్కేజీ నుంచి పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, నోటు పుస్తకాలు కలిపి 15-20 వరకు ఉంటాయి. ఎగువ తరగతులకు వెళ్లేకొద్దీ సంఖ్య, పరిమాణం పెరుగుతోంది. ఆ మేరకు పిల్లలు వీపుపై బడి సంచి రూపంలో దాదాపు 10-15 కిలోల బరువు పడుతోంది. పలు ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నాలుగైదు అంతస్తుల్లో ఉంటున్నాయి. చిన్నారులు కిలోలకొద్దీ బరువు గల బ్యాగులతో మెట్లు ఎక్కేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
నెలకు ఒకట్రెండు రోజులు
నగరంలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు బడి సంచి లేకుండా పాఠశాలలకు వచ్చే విధానం అమలు చేస్తున్నాయి. సికింద్రాబాద్లోని సెయింట్ పీటర్ పాఠశాల నెలకోసారి ఈ అవకాశం కల్పించింది. రెండు రోజులకు పొడిగించేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని విద్యాసంస్థలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ‘‘చదువును ఇష్టపడేలా చేస్తే విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. అన్ని రోజులూ పుస్తకాల్లేకుండా చదువులు సాగవు. అందుకే ఒకట్రెండు రోజులు అవకాశం ఇచ్చాం.’’ అని సెయింట్ పీటర్ పాఠశాల ప్రిన్సిపల్ కె.సువర్ణ వివరించారు.
దిల్లీ, ఒడిశా రాష్ట్రాలు ఆదర్శం
పిల్లల ఇబ్బంది పడకుండా దిల్లీ ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఒకటి, రెండు తరగతులకు పుస్తకాల సంచి 1.5 కిలోలకు మించరాదని; 3, 4, 5 తరగతులకు 2-3 కిలోలు; 6, 7 తరగతులకు 4 కిలోలు; 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతికి 5 కిలోలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఒడిశాలోనూ ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల సంచి బరువు నిర్దేశిత స్థాయిలో ఉండాలని స్పష్టం చేసింది. నగరంలోని పాఠశాలల్లోనూ పరిమితులు విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
శారీరక, మానసిక సమస్యలకు అవకాశం: డాక్టర్ జె.ఉమేష్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఉద్దీప్య వెల్ బేబీ క్లినిక్
చదువుకొనే రోజుల్లో ప్రతి అయిదుగురిలో ఒక విద్యార్థి వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. వీపుపై పడే బరువు మెడ నరాలపైన ఒత్తిడి పెంచడమే కాకుండా, తల, భుజాల నొప్పికి దారి తీస్తోంది. వెన్నెముక కింద నొప్పి రావడం, నిటారుగా నిలబడలేక సమతుల్యం కోల్పోయి ఒకవైపునకు వంగిపోవడం జరుగుతోంది. దీర్ఘకాలంలో కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడుపై ప్రభావం పడి, హోంవర్క్ చేయకపోవడం, ముఖ్యమైన పుస్తకాలు మరిచిపోవడం చేస్తుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిని భయాందోళన నెలకొనే ప్రమాదం ఉంది. కొన్ని సూచనలు పాటిస్తే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
‣ బ్యాగు బరువు విద్యార్థి బరువులో పది శాతం.. అంతకంటే తక్కువ ఉండాలి.
‣ సంచిలో ఎక్కువ భాగాలు ఉండాలి. పుస్తకాలు సమానంగా సర్దుకుంటే బరువు ఒకేచోట పడదు.
‣ బ్యాగు నడుముకు రెండు అంగుళాలు కిందకు ఉండేలా చూసుకోవాలి.
‣ రోలర్(చక్రాల) సంచులు వినియోగిస్తే మేలు. తదనుగుణంగా పాఠశాలల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.